హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామల మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటికే భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈదిన 47 ఏండ్ల శ్యామల తాజాగా అమెరికాలోని కేటలీనా చానెల్లోనూ సత్తాచాటింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఏడు ఓపెన్ వాటర్ పోటీల్లో ఒకటైన కేటలీనా చానెల్‌ను శ్యామల విజయవంతంగా ఈదింది. గత నెల 28, 29 తేదీల్లో సాంటా కేటలీనా ఐస్లాండ్ నుంచి లాస్ఏంజిల్స్ వరకు 36కి.మీల దూరాన్ని 19 గంటల నాలుగు నిమిషాల 47 సెకన్లలో ఈది ఔరా అనిపించింది. 16 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న జలాల్లో డాల్ఫిన్లు, ప్రమాదకర షార్క్‌లు, సీల్స్ బారి నుంచి తప్పించుకుంటూ శ్యామల ఈ లక్ష్యాన్ని చేరుకుంది. కేటలీనా చానెల్‌ను ఈదిన తొలి తెలుగు మహిళా స్విమ్మర్‌గా శ్యామల అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు భారత్ నుంచి 10 మంది స్విమ్మర్లు కేటలీనా చానెల్లో పోటీపడితే ఇందులో నాలుగో మహిళా స్విమ్మర్‌గా శ్యామల నిలిచింది. అమెరికా గడ్డపై సాహాసోపేతమైన ప్రదర్శనను కనబరిచి దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపచేసిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ‘కేటలీనా చానెల్‌ను విజయవంతంగా ఈదిన శ్యామలకు హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’అని ట్వీట్ చేశారు.