న్యూఢిల్లీ: భారత వెటరన్ రెజ్లర్ సుశీల్‌కుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జాతీయ మాజీ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ ధన్కర్ హత్య కేసులో సుశీల్‌కుమార్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. గత మార్చి 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పును సంజయ్ కరోల్, ప్రశాంత్‌కుమార్ మిశ్రాతో కూడిన సుప్రీం బెంచ్ కొట్టిపడేసింది. వారం రోజుల్లోగా సుశీల్ లోంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దివంగత సాగర్ ధన్కర్ తండ్రి అశోక్ ధన్కర్ వేసిన పిటిషన్‌ను తాజాగా విచారించిన సుప్రీం తీర్పు వెలువరించింది. ఆస్తి వివాదంలో అడ్డుగా వచ్చాడన్న కారణంతో మే 2021లో సాగర్ ధన్కర్ను సుశీల్‌కుమార్‌తో పాటు పలువురు తీవ్రంగా బాదడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. దేశానికి రెండు ఒలింపిక్ పతకాలు అందించిన సుశీల్ కెరీర్ ఈ హత్యతో ఘోరంగా మసకబారింది.