కోల్‌కతా: ఐపీఎల్ గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ యాజమాన్యం తనకు సారథ్య పగ్గాలు అప్పజెప్పితే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ అన్నాడు. మంగళవారం అతడు ఈఎస్పీఎన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘అవును.. నేను సిద్ధమే. కెప్టెన్సీ గురించి నేనెప్పుడూ ఒకే మాట చెబుతుంటా. నాయకత్వం అనేది ఒక ట్యాగ్ మాత్రమే అని నేను నమ్ముతాను. నాయకుడిగా ఉంటూ చాలా పెద్ద పాత్ర పోషించాలి. నా వరకు వస్తే నేను దానికి నో అని చెప్పడానికేమీ లేదు. జట్టులో సారథిగా ఉన్నా లేకున్నా నా మాటకు విలువిస్తూ నా అభిప్రాయాలను గౌరవించే విధంగా ఉంటే.. కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా నాకు అంగీకారమే’ అని అన్నాడు.
శ్రీనిధి ఎఫ్‌సీ జోరు
గోవా: ప్రతిష్ఠాత్మక ఐ-లీగ్‌లో శ్రీనిధి దక్కన్ ఫుట్‌బాల్ ఎఫ్‌సీ గెలుపు జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మంగళవారం పీజేఎన్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీనిధి ఎఫ్‌సీ 3-2తో డెంపో ఎస్సీపై అద్భుత విజయం సాధించింది. శ్రీనిధి తరఫున డెవిడ్ కాస్టాండ మునోజ్(53ని, 59ని) డబుల్ గోల్స్‌తో అదరగొట్టగా, బ్రాండన్(69ని) మరో గోల్చేశాడు. మార్కస్ జోసెఫ్(8ని), జువాన్ మెరా(45ని)..డెంపోకు గోల్స్ అందించారు. శ్రీనిధి ఎఫ్‌సీ ప్రస్తుతం 22 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నది.