లాస్ ఏంజిల్స్: వెనిజులా దేశానికి చెందిన మేటి సైక్లిస్ట్ డానిలా లార్రియల్ చిరినోస్(Daniela Larreal Chirinos).. లాస్ వెగాస్‌లోని తన అపార్ట్మెంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఆగస్టు 16వ తేదీన ఆమె మృతదేహాన్ని గుర్తించారు. లాస్ వెగాస్‌లో హోటల్లో పనిచేస్తున్న ఆమె.. పనికి రాకపోవడంతో ఆమె కోసం వెతికారు. ఆగస్టు 11వ తేదీన చిరినోస్ మృతిచెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆమె గొంతులో ఘన ఆహార పదార్ధాలను గుర్తించారు. వాటి వల్ల ఆమెకు శ్వాస ఆడి ఉండదని భావిస్తున్నారు.
ఒకప్పుడు వెనిజులా మేటి అథ్లెట్‌గా చిరినోస్కు గుర్తింపు ఉన్నది. ఆమె ఆ దేశం తరపున ఏకంగా అయిదు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహించింది. 1992 నుంచి 2012 వరకు సైక్లిస్ట్‌గా ఆమె మెగా క్రీడల్లో పాల్గొన్నది. 1992లో బార్సిలోనా, 1996లో అట్లాంటా, 2000లో సిడ్నీ, 2004లో ఏథెన్స్, 2012లో లండన్ గేమ్స్‌లో ఆమె ప్రాతినిధ్యం వహించింది. తన కెరీర్లో ఎన్నో పతకాలు గెలుచుకున్నదామె. 2002లో సెంట్రల్ అమెరికన్, కరీబియన్ గేమ్స్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. 2003 పాన్ అమెరికన్ గేమ్స్‌లో రెండు సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నది. సైక్లింగ్ లోకంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది.
వెనిజులా రాజకీయాలను మాజీ అథ్లెట్ తీవ్రంగా విమర్శించేది. హ్యూగో ఛావేజ్ అంటే ఆమెకు నచ్చదు. ఫేక్ రేసింగ్ డ్రైవర స్పాన్సర్‌షిప్‌తో ఛావేజ్ నిధుల్ని దుర్వినియోగం చేసినట్లు ఆమె ఆరోపించింది. 2013లో నికోలస్ మాడురో బాధ్యతలు స్వీకరించడాన్ని కూడా ఆమె వ్యతిరేకించింది. దీంతో చిరినోస్పై వెనిజులాలో ఎంట్రీ బ్యాన్ విధించారు. మియామీలో ఊబర్ డ్రైవర్‌గా చేసింది. ఆ తర్వాత వెగాస్‌లో ఫుడ్ సర్వర్‌గా చేసింది.