వాజేడు, ఆగస్టు 28 : ప్రపంచ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ ఆటగాడు మోడెం వంశీ సత్తాచాటాడు. నార్త్ అమెరికాలోని శాన్‌జోస్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో వంశీ రెండు పసిడి పతకాలతో మెరిశాడు. ములుగు జిల్లా వాజేడు మండంల ఇప్పగూడెం గ్రామానికి చెందిన వంశీ..పురుషుల జూనియర్ 66కిలోల విభాగంలో ప్రత్యర్థులకు దీటైన సవాలు విసిరాడు. స్కాట్‌లో 300కిలోలు, బెంచ్‌ప్రెస్‌లో 145కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 235కిలోలు మొత్తం 680కిలోలతో వంశీ అగ్రస్థానంలో నిలిచాడు. ఇదే విభాగంలో బ్రాడీ పీస్ట్(అమెరికా, 677.5), క్మిట్రో బుటెంకో(ఉక్రెయిన్, 677.5) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.
గిరిజన యువకుడైన వంశీ గత ఏడాది మాల్టాలో జరిగిన టోర్నీలోనూ స్వర్ణ పతకంతో ఆకట్టుకున్నాడు. ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ టోర్నీలో రెండు పసిడి పతకాలు సాధించిన వంశీని రాష్ట్ర పవర్‌లిఫ్టింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి జోసెఫ్ జేమ్స్ అభినందించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో వంశీ పతకాలు సాధించడం పట్ల మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన వంశీకి పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చినా ఆర్థిక స్థోమత లేక దాతల సహకారంతో రూ.4లక్షలు సమకూరినా…మరో 2లక్షలు అప్పుజేసి వెళ్లాడని పేర్కొన్నాడు. ఏటూరు నాగారం ఐటీడీఏ నుంచి రూ.50వేలు మినహా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందడంలేదని వంశీ సన్నిహితులు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్న వంశీ మరిన్ని పతకాలు సాధించేలా ప్రభుత్వం మద్దతుగా నిలువాలని వారు కోరుతున్నారు.