సైప్రస్: భారత చదరంగ కీర్తికిరీటంలో మరో కలికుతురాయి చేరింది. ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి నయా చరిత్ర లిఖించింది. గతంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును అందుకుంటూ క్యాండిడేట్స్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా చాంపియన్‌షిప్ దక్కించుకున్న తొలి భారత ప్లేయర్‌గా వైశాలి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన 14వ గేమ్‌లో వైశాలి 48 ఎత్తుల వద్ద లగ్నా కేథరిన్(ఉక్రెయిన్)పై సంచలన విజయం సాధించింది. దీంతో 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
క్యాండిడేట్స్ విజేతగా ఆమె ప్రతిష్టాత్మక ప్రపంచ చాంపియన్‌కు అర్హత సాధించింది. గేమ్ విషయానికొస్తే..తెల్ల పావులతో బరిలోకి దిగిన వైశాలి అద్భుత వ్యూహాలతో ముందుకు సాగింది. తొలుత ఉక్రెయిన్ ప్లేయర్ ఆధిక్యం కనబరిచినా..వైశాలి పుంజుకుని గేమ్‌ను తన వైపునకు తిప్పుకుంది. ముఖ్యంగా ఆఖర్లో వేసిన ఎత్తు వైశాలి విజేతగా నిలువడంలో కీలకమైంది. మరోవైపు మరో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్యాదేశ్ముఖ్..కజకిస్థాన్ జీఎం అస్సాబయోవా బిబిసారా ఆఖరి గేమ్‌ను డ్రా చేసుకోవడం వైశాలికి అనుకూలంగా మారింది. దివ్య ఐదున్నర పాయింట్లతో టాన్ జాంగ్యి(చైనా)తో కలిసి సంయుక్తంగా ఏడో స్థానానికి పరిమితమైంది. ఇదిలా ఉంటే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదు సార్లు విజేత జు వెన్ జు (చైనా)తో వైశాలి తలపడనుంది.
క్యాండిడేట్స్ టోర్నీలో భారత యువ జీఎం ప్రజ్ఞానందకు నిరాశ ఎదురైంది. హికారు నకామురతో జరిగిన ఆఖరి రౌండ్ గేమ్‌ను 33 ఎత్తుల వద్ద ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. దీంతో ఆరు పాయింట్లతో ఆరో స్థానంలో నిలువగా, జావోకిర్ సిందరోవ్(10) అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం గుకేశ్‌తో సిందరోవ్ తలపడనున్నాడు.