ముంబై: ఐపీఎల్లో సెన్షేషన్‌గా మారిన టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) త్వరలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. అత్యంత పిన్న వయసులోనే టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన క్రికెటర్‌గా నిలవబోతున్నాడు. ఇటీవల జరిగిన అండర్19 వరల్డ్‌కప్‌తో పాటు తాజాగా జరుగుతున్న ఐపీఎల్లో సూర్యవంశీ తన స్ట్రోక్ ప్లేతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. అయితే టాప్ ఫామ్‌లో ఉన్న 15 ఏళ్ల వైభవ్‌ను.. జూన్‌లో జరగబోయే ఐర్లాండ్ ట్రిప్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఐర్లాండ్‌కు ఎంపిక చేయబోతున్న ప్లేయర్ల షార్ట్‌లిస్టులో సూర్యవంశీ పేరు ఉన్నట్లు తెలిసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అనేక మంది ప్లేయర్లతో పాటు వైభవ్‌ను కూడా షార్ట్‌లిస్టు చేసినట్లు ఓ మీడియా తన కథనంలో పేర్కొన్నది. ఐర్లాండ్‌తో పాటు జింబాబ్వేతో ఈ ఏడాది చివరలో జరిగే సిరీస్‌కు కూడా వైభవ్‌ను ఎంపిక చేసినట్లు ఆ కథనంలో వెల్లడించారు. ఏజ్గ్రూపు క్రికెట్లో ఇప్పటికే సూర్యవంశీ చాలా రికార్డులు నెలకొల్పాడు. ఇక ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున వైభవ్ ఆడుతున్నాడు. అత్యంత పిన్న వయస్కుడిగా టీమిండియా తరపున అరంగేట్రం చేసిన క్రికెటర్‌గా వైభవ్ నిలుస్తారని, గతంలో సచిన్, షఫాలీ వర్మ పేరిట ఉన్న రికార్డును అతను బ్రేక్ చేస్తాడని ఐపీఎల్ చైర్మెన్ అరుణ్ దూమల్ తెలిపారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో ఇండియన్ జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇక మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ 15 ఏళ్లు, ఏడు నెలల 27 రోజులకు భారత్ తరపున ఆడింది. ఈ ఇద్దరి కన్నా తక్కువ వయసులోనే ఇండియా తరపున వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి.