వాషింగ్టన్: శుద్దీకరించిన యురేనియం(Enriched Uranium) అంశంలో ఇరాన్ క్లారిటీతో ఉన్నది. రాబోయే 20 ఏళ్ల వరకు యురేనియం శుద్దీకరణ నిలిపివేయాలని అమెరికా ఇటీవల కోరింది. ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చల సమయంలో ఇరాన్‌పై ఆ ఆంక్షలు పెట్టింది. కానీ సోమవారం అధికారికంగా ఇరాన్ తన నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. కేవలం అయిదేళ్ల వరకు మాత్రమే యురేనియం శుద్దీకరణ నిలిపివేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇరాన్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన కథనాన్ని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఓ అమెరికా అధికారితో పాటు ఇద్దరు ఇరానీ అధికారులు ఆ రిపోర్టుపై స్పందించారు.
ఇరాన్ చేసిన ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. శుద్దీకరించిన యురేనియం అంశంలో అమెరికా చేస్తున్న రిక్వెస్ట్‌లను కూడా ఇరాన్ తిరస్కరిస్తున్నది. ఈ అంశంపైనే మొదటి దఫా చర్చలు స్తంభించిపోయినట్లు తెలిసింది. తమ వద్ద ఉన్న యురేనియం గాఢతను తగ్గిస్తామని ఇరాన్ పేర్కొన్నట్లు రిపోర్టులో తెలిపారు. యురేనియంను పలుచన చేసిన తర్వాత మళ్లీ అవసరాన్ని బట్టి అణ్వాయుధానికి తగినట్లు శుద్దీకరించుకుంటామని ఇరాన్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మరో వైపు యురేనియం అంశంలో రష్యా ఆసక్తిగా ఉన్నది. ఇరాన్ వద్ద ఉన్న శుద్దీకరించిన యురేనియంను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా తెలిపింది. దీనిపై క్రెమ్లిన్ సోమవారం ప్రకటన చేసింది. యురేనియం అంశంలో అమెరికాతో డీల్‌పై ఎదురుచూస్తున్నట్లు రష్యా చెప్పింది. అమెరికాతో పాటు ప్రాంతీయ దేశాలతో ఈ అంశంపై పుతిన్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. తాము ఇచ్చిన ఆఫర్ ఇంకా టేబుల్‌పైనే ఉన్నట్లు రష్యా చెబుతోంది. కానీ దాన్ని ఎవరూ ఆమోదించలేదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో యురేనియం నిల్వల అంశమే కీలకంగా మారింది. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా పేర్కొన్నది.