Usain Bolt | ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన లెజెండ్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మోసపోయాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్‌పై ఎందరికో షాకిచ్చిన ఉసేన్ బోల్ట్‌కు.. ఓ స్టాక్స్‌లో పెట్టిన పెట్టుబడితో షాక్ తగిలింది. దాదాపు 12 మిలియన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.103 కోట్లు) మేర నష్టపోయినట్లు ఆయన న్యాయవాదులు పేర్కొన్నారు. 10 రోజుల్లో డబ్బు చెల్లించనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీని లాయర్లు హెచ్చరించారు. ఉసేన్ బోల్ట్‌తో పాటు మరో 30 మంది ఖాతాదారులు కూడా భారీగా మోసపోయినట్లు సమాచారం.
జమైకాకు చెందిన ప్రముఖ స్పింటింగ్ లెజెండ్ ఉసేన్ బోల్ట్.. రిటైర్మెంట్ తర్వాత కూడా అత్యంత వేగవంతమైన వ్యక్తిగా రికార్డును కలిగి ఉన్నాడు. ఈయన రిటైర్మెంట్ అనంతరం వచ్చే పెన్షన్ డబ్బులను జాగ్రత్తగా దాచుకుని ఖర్చుచేస్తున్నారు. కాగా, కింగ్స్టన్ వేదికగా ఉన్న పెట్టుబడి సంస్థ స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లోని అతడి ఖాతా నుంచి దాదాపు 12 మిలియన్ డాలర్ల మొత్తం మాయమయ్యాయి. డబ్బు మాయమైనది తెలియగానే ఆయన న్యాయవాదులు విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన ఖాతాలో కేవలం 12 వేల డాలర్లు మాత్రమే ఉండి దివాళ అంచున ఉన్నారు.
ఉసేన్ బోల్ట్ పదవీ విరమణ అనంతరం అందిన సొమ్మును ఈ ఖాతాలో ఉంచారని, ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు మాయమవడంతో ఈ కేసును కోర్టుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తరపు న్యాయవాది లింటన్ పీ గోర్డాన్.. ఫార్చ్యూన్ మ్యాగజైన్‌కు తెలిపారు. ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఉన్న సమయంలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన బోల్ట్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. లండన్ ఒలింపిక్స్ నుంచి బీజింగ్ ఒలింపిక్స్ వరకు ఎన్నో రికార్డులను 8 బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి గొప్ప క్రీడాకారుడు ఇప్పుడు ఇలా మోసానికి గురవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది.