US Open 2024 : ప్రపంచ టెన్నిస్‌లో అమెరికాది ప్రత్యేక స్థానం. ఆ దేశం నుంచి ఎందరో మహిళా టెన్నిస్ స్టార్లు పుట్టుకొచ్చారు. విలియమ్స్ సిస్టర్స్ (Williams Sisters) తర్వాత టీనేజర్ కొకో గాఫ్(Coco Gauff) గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో అమెరికా పేరును గట్టిగా వినిపించేలా చేశారు. ఇప్పుడు వీళ్ల అడుగు జాడల్లోనే ఓ టీనేజర్ దూసుకొస్తోంది. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్(US Open 2024)లో అమెరికా యువకెరటం ఇవా జోవిక్(Iva Jovic) బోణీ కొట్టింది.
పదహారేండ్ల వయసులోనే తొలి విజయాన్ని రుచి చూసింది. తద్వారా 24 ఏండ్ల తర్వాత ఈ టోర్నీ మెయిన్ డ్రాలో గెలుపొందిన తొలి అమెరికన్‌గా జోవిక్ చరిత్ర సృష్టించింది. అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీ తొలి రౌండ్లో విజేతగా నిలిచిని ఈ యంగ్‌స్టర్ అమెరికా భావి టెన్నిస్ తారగా ప్రశంసలు అందుకుంటోంది.
యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లో జోవిక్ అదరగొట్టింది. పోలాండ్‌కు చెందిన మగ్డ లినెట్టె (Magda Linette)ను 6-4, 6-3తో చిత్తుగా ఓడించింది. గంట 28 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన జోవిక్ ప్రత్యర్థిని అలవోకగా మట్టికరిపించింది. ఈ విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన ఆమె టెన్నిస్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం.
Dream debut for Iva Jovic 🙌 The 16-year-old American defeats Linette in two ✌️ pic.twitter.com/0axmzZe7t8
— US Open Tennis (@usopen) August 26, 2024
క్యాలిఫోర్నియాకు చెందిన జోవిక్ తల్లిదండ్రులు బొజన్, జెలెనా… ఇద్దరూ డాక్టర్లే. చిన్నప్పటి నుంచే జోవిక్కు ఆటలంటే ఇష్టం. టైమ్ దొరికితే చాలు జిమ్నాస్టిక్స్, సాకర్ ఆడేది. తరచూ స్విమ్మింగ్ పూల్‌లో ఈత కూడా కొట్టేది. చివరకు ఆమె టెన్నిస్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. తమ ఇంటి పైకప్పు మీదున్న కోర్టులో అక్కయ్యతో కలిసి జోవిక్ నిత్యం టెన్నిస్ ప్రాక్టీస్ చేసేది.
ఆ తర్వాత జాక్ క్రామెర్ క్లబ్ తరఫున ఆమె సత్తా చాటింది. అక్కడితో ఆమె జూనియర్ స్థాయిలో జోరు చూపిస్తూ వస్తోంద. ఈ మధ్యే యూఎస్ టెన్నిస్ అమ్మాయిల 18 దేశాల చాంపియన్‌షిప్‌లో జోవిక్ విజేతగా అవతరించింది. దాంతో, యూఎస్ ఓపెన్‌లో ఈ యంగ్‌స్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సాధించింది.
టెన్నిస్‌లో వడివడిగా అడుగులేస్తున్న జోవిక్ ఆరాధ్య ఆటగాడు ఎవరో తెలుసా?.. వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్. ‘అవును జకోవిచ్ నా ఆరాధ్య టెన్నిస్ ప్లేయర్. అతడు ఎంత గొప్ప ఆటగాడో మనందరికీ తెలుసు. ఇక మహిళల విభాగంలో బెలిండా బెన్సి(Belinda Bencic)క్ నా ఫేవరెట్. ఆమె ఫుట్‌వర్క్, బంతిని అంచనా వేసే తీరు, నెట్ మీద నుంచి పంచే విధానం.. ఇవన్నీ చాలా బాగుంటాయి. బెలిండా మాదిరిగానే నేను కూడా ఆడాలనుకుంటున్నా’ అని జోవిక్ తన భవిష్యత్ గురించి చెప్పింది. జోవిక్ తర్వాతి రౌండ్లో 29వ సీడ్ ఎకటెరినా అలెగ్జాండ్రోవాతో తలపడనుంది.