Akhanda 2 | టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ చివరగా ‘అఖండ 2’ చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కగా, డిసెంబర్ 12న విడుదలైంది. బాలయ్య-బోయపాటి కాంబోతో గతంలో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ చిత్రాలు వరుస హిట్లు కొట్టగా, ఈసారి హ్యాట్రిక్ విఫలమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలైన తొలి రోజు నుంచి మూవీ నెగటివ్ టాక్ ఎదుర్కొంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైనప్పటికీ, ఫలితంగా రెండు కోట్లకుపైగా నష్టాలు రికార్డ్ అయ్యాయని సమాచారం. మొత్తం వ్యాపారం రూ.103 కోట్లు ఊహించినప్పటికీ, గ్రాస్ కలెక్షన్స్ సుమారు రూ.120 కోట్లు, షేర్ వసూలు రూ.70 కోట్లు మాత్రమే. దీని ప్రభావంతో బయ్యర్లు ఇప్పుడు దర్శకుడు బోయపాటిపై కాస్త ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తుంది.
‘అఖండ 2’ ఫలితం బాలయ్య తదుపరి సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బీకే 111 ప్రాజెక్ట్ హోల్డ్‌లో ఉంది. ఈ సినిమా పీరియాడికల్, హిస్టారికల్ యాక్షన్ కాన్సెప్ట్‌తో, బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తారని ప్రచారం. ఒక పాత్రలో రాజుగా, మరొక పాత్రలో యోధుడిగా కనిపించనున్నారు. అయితే ‘అఖండ 2’ పరాజయం కారణంగా సినిమా బడ్జెట్ తగ్గింపు, స్క్రిప్ట్ మార్పులు చేయడం ప్రారంభమైందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. పీరియడ్, హిస్టరీ ఎపిసోడ్స్‌ని తగ్గించి, రెగ్యులర్ కమర్షియల్ మూవీలా మార్చే దిశలో పని జరుగుతోందని తెలుస్తోంది. కథ ఫైనల్‌గా పూర్తైతే సినిమా షూటింగ్ కొనసాగుతుందని, లేదంటే ప్రాజెక్ట్ రద్దు అయ్యే అవకాశం కూడా ఉందని సమాచారం.
బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబోలో చివరగా వచ్చిన ‘వీర సింహారెడ్డి’ సక్సెస్ తర్వాత, ‘ఎన్బీకే 111’ కోసం భారీ ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. కానీ ‘అఖండ 2’ ఫలితం గణనీయమైన ఎఫెక్ట్ చూపింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో చర్చకు ప్రధాన అంశంగా మారింది. అభిమానులు, సినీ వర్గాలు ఇప్పుడు ‘ఎన్బీకే 111’ ప్రాజెక్ట్ భవిష్యత్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘అఖండ 2’ పరాజయం బాలయ్యకి ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి.