న్యూయార్క్: సీజన్ ముగింపు టోర్నీ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టాప్‌సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ స్వియాటెక్ 3-6, 6-1, 6-4తో ఆరోసీడ్ అరియానా సబలెంక(బెలారస్)పై విజయం సాధించింది. ఇప్పటికే రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఖాతాలో వేసుకున్న స్వియాటెక్ ముచ్చటగా మూడో టైటిల్ పట్టేందుకు అడుగు దూరంలో నిలిచింది. రెండు గంటలా 11 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్ కోల్పోయిన స్వియాటెక్.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు నెగ్గింది. ఈ క్రమంలో ఒక దశలో చివరి 20 పాయింట్లలో 16 కైవసం చేసుకొని అదుర్స్ అనిపించుకుంది. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో ఐదో సీడ్ జాబర్ (ట్యూనీషియా) 6-1, 6-3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరుగనున్న మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వియాటెక్‌తో జాబర్ అమీతుమీ తేల్చుకోనుంది.