కటక్: భారత యువ షట్లర్ ఉన్నతిహుడా సంచలన విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఓపెన్ రన్నరప్ మాళవిక బన్సోద్‌ను ఓడించి ఒడిశా ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన బీడబ్ల్యూఎఫ్ సూపర్-100 మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో పద్నాలుగేండ్ల ఉన్నతి 24-22, 24-22తో మాళవికను చిత్తు చేసింది. హోరాహోరీగా జరిగిన పోరులో రెండు గేమ్‌ల్లోనూ ఆధిక్యం కనబర్చిన వర్ధమాన షట్లర్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో స్మిత్ తోష్నివాల్‌తో ఉన్నతి హుడా అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్ సెమీస్‌లో నెగ్గిన ప్రియాంశు రాజవత్, కిరణ్ జార్జ్ మధ్య టైటిల్ వేట సాగనుండగా.. డబుల్స్ సెమీస్‌లో నెగ్గిన భారత ద్వయం రవికృష్ణ-శంకర్ ప్రసాద్ తుది పోరులో మలేషియా జోడీ నుర్ మహ్మద్ అజ్రిన్-లిమ్ కిమ్ వా జోడీతో టైటిల్ వేట సాగించనుంది. మిక్స్డ్ డబుల్స్‌లో త్రిషా జాలీ-ఎంఆర్ అర్జున్ జంట 21-9, 21-9తో శ్వేతపర్ణ పాండా-బల్కేశరి యాదవ్ ద్వయంపై నెగ్గి ఫైనల్లోకి అడుగుపెట్టింది. శ్రీలంక ద్వయం సచిన్ డయాస్-థిలిని హేందవాతో భారత ద్వయం తుదిపోరులో తలపడనుంది.