న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరిగే సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్నకు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) సంస్థ వెల్లడించింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే ఈ పోటీలకు ఢిల్లీ వేదిక కావడం గత మూడేండ్లలో ఇది రెండోసారి. చివరిసారిగా ఢిల్లీ 2020 ఫిబ్రవరిలో ఈ పోటీలకు వేదికగా నిలిచింది. ర్యాంకింగ్ సిరీస్ పోటీలలో రెజ్లర్లు తమకు ఇష్టమైన విభాగంలో పాల్గొనేందుకు వీలుగా శరీర బరువులో 20 కిలోల వరకు సడలింపునకు అనుమతిస్తూ యూడబ్ల్యూడబ్ల్యూ నిర్ణయం తీసుకుంది.