పంతం పడితే పట్టుబట్టి సాధించుకునే నైజం.. బరిలోకి దిగితే చివరి వరకు పోరాడే తత్వం! పేదరికం ముందరికాళ్లకు బంధం వేస్తున్నా.. అవరోధాలను దాటుకొని ముందుకు సాగిన పోరాటం! యువ భారత జట్టు అండర్-19 ప్రపంచకప్ నెగ్గడంలో ప్రధాన పాత్ర పోషించిన తెలుగు ఆటగాడు షేక్ రషీద్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా! మెగాటోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 50.25 సగటుతో 201 పరుగులు చేసి.. యంగ్‌ఇండియా ఐదోసారి వరల్డ్‌కప్ చేజిక్కించుకోవడంలో కీలకమైన రషీద్ తన అనుభవాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నాడు.
ఆ వివరాలు అతడి మాటల్లోనే..
ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించడమనేది మరుపురాని సందర్భం. దీనికోసం చాలా కష్టపడ్డా. నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. ఏడేండ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలుపెట్టా. ఏ స్థాయి మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతా.
వీవీఎస్ లక్ష్మణ్ సార్ స్ఫూర్తి
ఈ టోర్నీలో నాతో పాటు ఆరుగురికి కరోనా సోకింది. కోవిడ్-19తో మ్యాచ్‌లకు దూరమవడం బాధ కలిగించింది. ఆ సమయంలో వీవీఎస్ లక్ష్మణ్ సార్ మాలో స్ఫూర్తి నింపారు. రోజు ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ కోసం సిద్ధమవ్వాలని సూచనలు చేశారు.
ఫైనల్ మ్యాచ్ ప్రత్యేకం
ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో ఓపెనర్ రఘువంశీ డకౌట్ అనంతరం బ్యాటింగ్‌కు దిగా. ఆ మ్యాచ్‌లో నా ప్రదర్శనకు స్ఫూర్తి విరాట్ కోహ్లీనే. ఈ టోర్నీ సమయంలో వీడియో కాల్లో కోహ్లీ సార్‌తో మాట్లాడా. అప్పుడు ‘వన్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగానని నేను ఆలోచించను.. ఓపెనర్‌గా ఆడుతున్నట్లే భావిస్తా’ అని కోహ్లీ సార్ చెప్పాడు. ఆ మాటలను మనసులో పెట్టుకునే ఆడా. నా ఆరాధ్య దైవం కోహ్లీనే. బౌలింగ్‌లో బుమ్రా శైలి అంటే ఇష్టం.
నా లక్ష్యం అదే
బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేస్తా. ప్రపంచకప్‌లో ఆ అవకాశం రాలేదు. రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నా. అమ్మానాన్నలు (జ్యోతి, బాలీ షా) ఎన్నో కష్టనష్టాలకోర్చి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎప్పటికైనా భారత జట్టులో స్థానమే నా లక్ష్యం.