మహిళల ఐపీఎల్ క్రేజ్ ఏంటో మరోమారు తెలిసొచ్చింది. రానున్న రెండో సీజన్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. మెరికల్లాంటి క్రికెటర్లను ఎంచుకునేందుకు జట్లన్నీ వేలంలో హోరాహోరీగా తలపడ్డాయి. పంజాబ్ యువ పేసర్ కాశ్వి గౌతమ్ జాక్‌పాట్ కొట్టింది. గుజరాత్ జెయింట్స్ జట్టు కాశ్విని రికార్డు స్థాయిలో రెండు కోట్లకు తీసుకోగా, వృందా దినేశ్‌ను 1.3 కోట్లతో యూపీ వారియర్స్ దక్కించుకుంది. నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ యువ క్రికెటర్ త్రిషా పూజితను గుజరాత్ పది లక్షలకు సొంతం చేసుకుంది.
ముంబై: డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట ఆసక్తికరంగా సాగింది. మొత్తం 30 బెర్తుల కోసం ఐదు ఫ్రాంచైజీలు తమదైన ప్రణాళికతో బరిలోకి దిగాయి. దేశవాళీ టోర్నీల్లో నిలకడగా రాణిస్తున్న పంజాబ్ యువ పేసర్ కాశ్వి గౌతమ్‌పై కనకవర్షం కురిసింది. ప్రస్తుతం భారత ‘ఎ’ జట్టులో సభ్యురాలైన కాశ్వి కనీస ధర రూ.10 లక్షలతో వేలంలోకి ప్రవేశించింది. తొలుత గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్..కాశ్విని సొంతం చేసుకునే తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు గుజరాత్ రెండు కోట్లు వెచ్చించి ఈ 20 ఏండ్ల పంజాబ్ పేసర్‌ను తమ జట్టులోకి తీసుకుంది. కాశ్వి సహచర క్రికెటర్ కర్ణాటకకు చెందిన వృందా దినేశ్‌ను యూపీ వారియర్స్ రూ.1.3 కోట్లకు కొనుగోలు చేసింది ఈ ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లు వేలంలో ఊహించని ధర పలికారు.
Trisha Poojitha
గుజరాత్‌కు త్రిష
హైదరాబాద్ యువ క్రికెటర్ త్రిషా పూజితను గుజరాత్ జెయింట్స్ కనీస ధర రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. కోల్‌కతాలో ప్రస్తుతం మహిళల అండర్-23 టీ20 టోర్నీ ఆడుతున్న త్రిష..డబ్ల్యూపీఎల్‌లో భాగం కాబోతున్నందుకు గర్వంగా ఉందని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపింది. వేలంలో పోటీకి దిగిన తొలిసారే ఎంపిక కావడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.