IPL | ముల్లాన్‌పూర్: ఐపీఎల్-18లో గత నాలుగైదు మ్యాచ్‌ల నుంచి ఎవరైనా బ్యాటర్ క్రీజులోకి రాగానే అంపైర్లు వారి బ్యాట్లను తనిఖీ చేస్తున్న దృశ్యాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ నడుస్తున్నది. మంగళవారం పంజాబ్, కోల్‌కతా మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్లు సునీల్ నరైన్, ఆన్రిచ్ నోకియా బ్యాట్ల సైజ్ తేడా రావడంతో అంపైర్లు వాటిని మార్చాలని ఆదేశించారు. దీంతో ఈ ఇద్దరూ వేరే బ్యాట్లతో ఆడాల్సి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం.
అయితే ఈ లీగ్‌లో ఇలాంటి దృశ్యాలు కొత్త అయినప్పటికీ నియమ నిబంధనలు మాత్రం పాతవే. గతంలో బ్యాటర్లు క్రీజులోకి తీసుకొచ్చే బ్యాట్లను డ్రెస్సింగ్ రూముల్లోనే కొలిచేవారు. కానీ ఇప్పుడు ఆన్‌ఫీల్డ్ అంపైర్ గానీ, బౌండరీ లైన్ వద్ద ఉండే మ్యాచ్ సిబ్బంది గానీ బ్యాట్లను పరిశీలిస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం బ్యాట్ వెడల్పు 10.79 సెంటీమీటర్లకు మించకూడదు. బ్యాట్ మందం 6.7 సెం.మీ, పొడవు 96.4 సెం. మీ, బ్యాట్ అంచు వెడెల్పు 4 సెం.మీ దాటకూడదు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే అంపైర్లు నరైన్, నోకియా బ్యాట్లను మార్చారు.