‘వేర్ టాలెంట్ మీట్స్ ఆపార్చ్యునిటీ’.. ఐపీఎల్ ట్యాగ్‌లైన్ ఇది. 18 సీజన్లుగా ఎందరో ప్రతిభావంతమైన క్రికెటర్లు ఈ లీగ్ ద్వారా వెలుగులోకి వస్తే వారిలో కొందరు స్టార్లుగా ఎదుగగా మరికొందరికి అదృష్టం కలిసొచ్చి జాతీయ జట్టుకూ ఆడుతున్నారు. ప్రస్తుతం పది జట్లలో ఉన్న స్టార్ క్రికెటర్లలో ఒకప్పుడు ఐపీఎల్ ద్వారా గుర్తింపుదక్కించుకున్నవారు సగానికంటే ఎక్కువమంది ఉంటారనడంలో అతిశయోక్తేమీ కాదు. నిరుటి సీజన్లోనూ పాలబుగ్గల పసివాడు వైభవ్ సూర్యవంశీ, అయూశ్ మాత్రె రూపంలో కొత్తనీరు భారత క్రికెట్లోకి రాగా శనివారం నుంచి ప్రారంభంకానున్న 19వ సీజన్లోనూ అలా రాణించగల సమర్థులూ ఉన్నారు. వారిలో కొందరి గురించి..
‘డాడీస్ ఆర్మీ’గా గుర్తింపు దక్కించుకుని గత రెండు, మూడు సీజన్లుగా ఆశించిన ఫలితం రాకపోవడంతో రూటు మార్చి యువ క్రికెటర్లపై దృష్టి సారించిన చెన్నై సూపర్ కింగ్స్.. వేలంలో ఏకంగా రూ. 14.20 కోట్లు పెట్టి దక్కించుకున్న కుర్రాడు ప్రశాంత్ వీర్. అమేథీకి చెందిన 20 ఏండ్ల ఈ యువ ఆల్‌రౌండర్.. దేశవాళీ ప్రదర్శనలతో చెన్నై స్కౌట్స్ కంట పడ్డాడు. రవీంద్ర జడేజా మాదిరిగానే స్లో లెఫ్టార్మ్ స్పిన్, ఎడమచేతివాటం బ్యాటింగ్‌తో దుమ్మురేపే ప్రశాంత్.. గత సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో అంచనాలకు మించి రాణించాడు. జడేజా స్థానాన్ని ప్రశాంత్ భర్తీ చేస్తాడని సీఎస్కే అతడిపై గంపెడాశలు పెట్టుకుంది. ‘జూనియర్ మిల్లర్’గా గుర్తింపు పొందిన ప్రశాంత్.. యూపీటీ20 లీగ్‌లో 155 స్ట్రైక్ రేట్‌తో 320 రన్స్ చేయడంతో పాటు 8 వికెట్లూ పడగొట్టాడు.
రాజస్థాన్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ ఒక సిక్స్ హిట్టింగ్ మిషిన్. వేలంలో సీఎస్కే ఇతడికీ రూ.14.2 కోట్లు పెట్టి దక్కించుకుంది. విజయ్‌హజారే ట్రోఫీతో పాటు 2025-26 రంజీ సీజన్లో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో ఈ కుర్రాడూ ఉన్నాడు. వేలంలో అతడి కోసం ఐదు ఫ్రాంచైజీలు పోటాపోటీగా బిడ్ వేశాయంటే మనోడి టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 28 సిక్స్‌లు కొట్టిన కార్తీక్ స్ట్రైక్ రేట్ 162.92గా ఉంది. ఈ కుర్రాడు గనుక కుదురుకుంటే చెన్నైకి మరో రైనా దొరికినట్టేనన్న వాదనలు ఇప్పటికే మొదలయ్యాయి.
ఇటీవల కాలంలో దేశవాళీల్లో బాగా వినిపిస్తున్న పేరు నబీ. ఈ జమ్మూకశ్మీర్ పేసర్ కొద్దిరోజుల క్రితం ముగిసిన రంజీ సీజన్లో ఏకంగా 60 వికెట్లు పడగొట్టి తన జట్టు చరిత్రాత్మక రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నబీని వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 8.40 కోట్లకు సొంతం చేసుకుంది. టీమ్ఇండియాలో షమీ స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తున్న నబీ గనుక ఈ ఐపీఎల్ సీజన్లో మెరిస్తే అతడికి జాతీయ జట్టులో చోటు అధికారికంగా ఖాయమైనట్టే!
భారత జట్టుకు లెఫ్టార్మ్ పేసర్ల కొరత ఎప్పట్నుంచో ఉంది. జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా తర్వాత చాలా రోజులకు పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. అతడి మార్గంలోనే యువ పేసర్ నమన్ తివారి సత్తాచాటుతున్నాడు. 2024 అండర్-19 ప్రపంచకప్ ద్వారా వెలుగులోకి వచ్చిన నమన్.. ఆ టోర్నీలో ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. యూపీ టీ20 లీగ్‌లో అతడు పది మ్యాచ్‌ల్లో 19 వికెట్లు పడగొట్టి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. 145 కిలోమీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేయడం అతడి ప్రత్యేకత. అందుకే వేలంలో లక్నో జట్టు అతడికి కోటి రూపాయల ధరకు దక్కించుకుంది. నమన్ గనుక సత్తాచాటితే టీమ్ఇండియాకు మరో లెఫ్టార్మ్ పేసర్ దొరికినట్టే!
ఈ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడబోతున్న తేజస్వి దహియా మరో చిచ్చరపిడుగు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన ఈ ఢిల్లీ కుర్రాడు.. బరిలోకి దిగాడంటే బౌలర్లకు బడితపూజే. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నిరుటి ఎడిషన్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు ఏకంగా 190 సగటుతో 339 రన్స్ సాధించాడు. ఆ సీజన్లో దహియా 29 సిక్స్‌లు బాది టోర్నీలో అత్యధిక సిక్స్‌లు కొట్టినవారిలో రెండో స్థానంలో ఉన్నాడు. స్మాట్లోనూ మనోడి విన్యాసాలు మామూలుగా లేవు. ఆ టోర్నీలో అతడి స్ట్రైక్‌రేట్ అయితే 278.94గా నమోదైంది. ధోనీని ఆరాధించే ఈ ఢిల్లీ సంచలనం కేకేఆర్‌కు ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో చూడాలి.