క్రైస్ట్‌చర్చ్: స్టాండిన్ కెప్టెన్ టామ్ లాథమ్ (278 బంతుల్లో 186 బ్యాటింగ్; 28 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. లాథమ్‌కు తోడు కాన్వే (99 బ్యాటింగ్), విల్ యాంగ్ (54) రాణించడంతో ఆదివారం ఆట ముగిసే సమయానికి కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 349 పరుగులు చేసింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టులో పరాజయం చవిచూసిన న్యూజిలాండ్.. ఆ ఓటమి నుంచి తేరుకొని సత్తాచాటింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు లాథమ్, యాంగ్ శుభారంభాన్నిచ్చారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు అందుకున్న లాథమ్ చక్కటి క్రికెటింగ్ షాట్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి వికెట్‌కు యాంగ్తో కలిసి 148 పరుగులు చేసిన లాథమ్.. అభేద్యమైన రెండో వికెట్‌కు కాన్వేతో కలిసి 201 పరుగులు జోడించడం విశేషం. మరోవైపు టెస్టు ఫార్మాట్లో ఆడిన ఐదు మ్యాచ్‌ల మొదటి ఇన్నింగ్స్‌ల్లో అర్ధశతకాలు నమోదు చేసిన తొలి ప్లేయర్‌గా కాన్వే రికార్డుల్లోకెక్కాడు.