వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన అనంతరం తేరుకున్న టీమ్ఇండియా.. నాలుగో టీ20లో కరీబియన్లతో అమీతుమీకి సిద్ధమైంది. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి కాగా.. ఫుల్ ఫామ్‌లో ఉన్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మపై అందరి దృష్టి నిలువనుంది.
లౌడర్‌హిల్: వెస్టిండీస్ పర్యటనలో పడుతూ లేస్తూ సాగుతున్న భారత్.. శనివారం కరీబియన్లతో నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. సిరీస్ సమం చేసేందుకు హార్దిక్ సేన కసరత్తులు చేస్తున్నది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ఆతిథ్యమివ్వనున్న అమెరికాలో ఈ మ్యాచ్ జరగనుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ భారత జట్టు సమిష్టిగా సత్తాచాటలేకపోయింది. ముఖ్యంగా ఓపెనర్ గిల్ ఆటతీరు మేనేజ్మెంట్ను తీవ్రంగా కలవరపెడుతున్నది. మూడు ఫార్మాట్లలో టీమ్ఇండియా రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన గిల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉండగా.. ఈ మ్యాచ్‌లోనూ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కే అవకాశం దక్కనుంది.
గత మ్యాచ్‌తో సూర్యకుమార్ టచ్‌లోకి రావడం టీమ్ఇండియాకు పెద్ద ఉపశమనం కాగా.. హైదరాబాదీ తిలక్ వర్మ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 39, 51, 49 నాటౌట్ స్కోర్లు చేసిన తిలక్ నుంచి అభిమానులు మరోసారి ఇలాంటి ప్రదర్శనే ఆశిస్తున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు సంజూ శాంసన్, అక్షర్ పటేల్ తమ బ్యాట్లకు పనిచెప్పాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌లో మరోసారి కుల్దీప్ యాదవ్ కీలకం కానుండగా.. పిచ్ పేస్‌కు సహకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒక స్పిన్నర్‌ను తగ్గించి మరో పేసర్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. ఈ పిచ్‌పై జరిగిన 13 మ్యాచ్‌ల్లో 11 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందడంతో.. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపొచ్చు. మరోవైపు 2016 తర్వాత భారత్‌పై టీ20 సిరీస్ నెగ్గని విండీస్ ఈ అవకాశాన్ని వదిలి పెట్టొద్దని భావిస్తున్నది.