పుణె: స్వదేశంలో జరిగిన ఏటీపీ వరల్డ్ టూర్ చాలెంజర్ టోర్నీలో రోహన్ బోపన్న-రామ్‌కుమార్ రామనాథన్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన టాటా మహారాష్ట్ర ఓపెన్ పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న-రామ్‌కుమార్ జోడీ 6-7 (10-12), 6-3, 10-6తో టాప్ సీడ్ ల్యూక్ సావిల్లె-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) ద్వయంపై విజయం సాధించింది. గంటా 44 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి సెట్‌ను టై బ్రేకర్‌లో కోల్పోయిన భారత జంట.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో విజృంభించింది. హోరాహోరీగా సాగిన పోరులో ఏడు ఎస్‌లు సంధించిన భారత జంట.. 79 పాయింట్లతో సత్తాచాటింది.