ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. తిరుగులేని ప్రదర్శనతో దుమ్మురేపిన హార్దిక్ గ్యాంగ్.. 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.సమవుజ్జీల సమరంగా భావించిన పోరులో గుజరాత్ ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ యాంకర్ రోల్ పోషించడంతో పోరాడే స్కోరు చేసిన టైటాన్స్.. ఆనక బౌలింగ్‌లో విశ్వరూపం కనబర్చింది. పకడ్బందీ బౌలింగ్‌తో షమీ వికెట్ల పతనానికి నాంది పలికితే.. రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలంతో లక్నోను ఉక్కిరిబిక్కిరి చేశాడు!
పుణె: ఐపీఎల్-15వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. లీగ్‌లో మొదటి సారి బరిలోకి దిగిన టైటాన్స్ ఆడిన 12 మ్యాచ్‌ల్లో తొమ్మిదింట నెగ్గి 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ‘లో స్కోరింగ్’మ్యాచ్‌లో గుజరాత్ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 144 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (49 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ తెవాటియా (16 బంతుల్లో 22 నాటౌట్; 4 ఫోర్లు) ఆఖర్లో వేగంగా ఆడాడు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 2, మొహసిన్ ఖాన్, హోల్డర్ చెరో వికెట్ పడగొట్టారు.
గిల్ ఓపెనర్‌గా బరిలోకి దిగి.. చివరి వరకు క్రీజులో నిలువగా.. వృద్ధిమాన్ సాహా (5), మాథ్యూ వేడ్ (10), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (11) విఫలమయ్యారు. లీగ్ తొలి అర్ధ భాగంలో అద్భుత బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన హార్దిక్ పాండ్యా.. గత ఐదు మ్యాచ్‌ల నుంచి పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన హార్దిక్.. ఒక్క బౌండ్రీ కూడా కొట్టకుండానే కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో గుజరాత్ ఆశించినంత స్కోరు చేయలేకపోయింది. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో 13.5 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. దీపక్ హుడా (27) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్ (8), క్వింటన్ డికాక్ (11), కరణ్ శర్మ (4), కృనాల్ పాండ్యా (5), ఆయుష్ బదోనీ (8), స్టొయినిస్ (2), హోల్డర్ (1) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, సాయికిషోర్, యష్ దయాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా బుధవారం రాజస్థాన్‌తో ఢిల్లీ తలపడనుంది.
చప్పగా సమ ఉజ్జీల సమరం..
ఐపీఎల్లో కొత్తగా అడుగుపెట్టిన ఈ రెండు ఫ్రాంచైజీల మధ్య జరిగిన పోరుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మినీ ఫైనల్‌గా ప్రచారం జరిగిన మ్యాచ్.. అభిమానులను ఆశించిన మేర అలరించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ భారీ స్కోరు చేయలేకపోగా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో తడబడింది. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై గిల్ నిలకడ కనబర్చడంతో ఓ మోస్తరు స్కోరు చేసిన గుజరాత్.. ఆ తర్వాత బౌలింగ్‌లో అద్భుతం చేసింది. ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లతో కూడిన లక్నో జట్టును 82 పరుగులకే పరిమితం చేస్తూ ఐపీఎల్ 15వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన గుజరాత్.. లక్నోపై సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటగా.. వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మూడు స్టంపౌట్లతో భళా అనిపించుకున్నాడు.
పవర్ హిట్టింగ్ చేయలేక..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించిన సీనియర్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా.. మూడో ఓవర్లోనే ఔట్ కాగా.. కాసేపటికే మాథ్యూ వేడ్ అతడిని అనుసరించాడు. ఫలితంగా గుజరాత్ 24 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో క్రీజులో తీవ్రంగా ఇబ్బంది పడిన హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువసేపు నిలువలేకపోగా.. మరో ఎండ్‌లో మొండిగా పోరాడుతున్న శుభ్‌మన్ గిల్‌కు డేవిడ్ మిల్లర్ (26) కాస్త సహకరించాడు. ఈ జోడీ కుదురుకోవడంతో ఆఖర్లో పరుగుల వరద పారుతుందేమో అనుకుంటే అది అత్యాశే అయింది. నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించిన అనంతరం మిల్లర్‌ను హోల్డర్ వెనక్కి పంపాడు. ఎప్పట్లాగే గిల్ యాంకర్ రోల్ పోషించినా.. మిగిలిన వాళ్లలో ఏ ఒక్కరు స్కోరు బోర్డును పరుగులు పెట్టించలేకపోయారు. ఫలితంగా గుజరాత్ తక్కువ స్కోరుకే పరిమితమవుతుందనుకుంటే.. ఆఖర్లో తెవాటియా నాలుగు బౌండ్రీలతో టైటాన్స్‌కు పోరాడే స్కోరు అందించాడు. లక్నో బౌలర్లలో కొత్త కుర్రాడు మొహసిన్ ఖాన్ ఒక్క వికెటే పడగొట్టినా.. పరుగులు నియంత్రిస్తూ గుజరాత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
స్కోరు బోర్డు
గుజరాత్: సాహా (సి) అవేశ్ (బి) మొహసిన్ 5, గిల్ (నాటౌట్) 63, వేడ్ (సి) డికాక్ (బి) అవేశ్ 10, హార్దిక్ (సి) డికాక్ (బి) అవేశ్ 11, మిల్లర్ (సి) బదోనీ (బి) హోల్డర్ 26, తెవాటియా (నాటౌట్) 22, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం: 20 ఓవర్లలో 144/4. వికెట్ల పతనం: 1-8, 2-24, 3-51, 4-103,
బౌలింగ్: మొహసిన్ 4-0-18-1, చమీరా 4-0-34-0, అవేశ్ 4-0-26-2, కృనాల్ 4-0-24-0, హోల్డర్ 4-0-41-1.
లక్నో: డికాక్ (సి) సాయి కిషోర్ (బి) యష్ దయాల్ 11, రాహుల్ (సి) సాహా (బి) షమీ 8, హుడా (సి) షమీ (బి) రషీద్ 27, కరణ్ శర్మ (సి) మిల్లర్ (బి) యష్ దయాల్ 4, కృనాల్ పాండ్యా (స్టంప్డ్) సాహా (బి) రషీద్ 5, ఆయుష్ బదోనీ (స్టంప్డ్) సాహా (బి) సాయికిషోర్ 8, స్టొయినిస్ (రనౌట్) 2, హోల్డర్ (ఎల్బీ) రషీద్ 1, మొహసిన్ (సి) రషీద్ (బి) సాయికిషోర్ 1, చమీరా (నాటౌట్) 0, అవేశ్ (స్టంప్డ్) సాహా (బి) రషీద్ 12, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 13.5 ఓవర్లలో 82 ఆలౌట్. వికెట్ల పతనం: 1-19, 2-24, 3-33, 4-45, 5-61, 6-65, 7-67, 8-70, 9-70, 10-82,
బౌలింగ్: షమీ 3-0-5-1, హార్దిక్ 1-0-8-0, యష్ దయాల్ 2-0-24-2, అల్జారీ 2-0-14-0, రషీద్ 3.5-0-24-4, సాయికిషోర్ 2-0-7-2.