సెయింట్ కిట్స్: పొట్టి ఫార్మాట్లో విధ్వంసక వీరుడు టిమ్ డేవిడ్ (37 బంతుల్లో 102, 6 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు శతకంతో విరుచుకుపడగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఆసీస్.. ప్రత్యర్థి నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని 23 బంతులుండగానే దంచేసింది. ఛేదనలో 9 ఓవర్లకు ఆస్ట్రేలియా 87/4తో కష్టాల్లో పడ్డా బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన డేవిడ్.. విండీస్ బౌలర్లపై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తాను ఎదురుకున్న తొలి 7 బంతుల్లో 15 పరుగులే చేసిన ఈ హిట్టర్.. గుడకేశ్ మోటీ వేసిన ఓవర్లో ఫోర్, వరుసగా నాలుగో సిక్సర్లు బాదాడు.
ఆ తర్వాత అకీల్ ఓవర్లో 6, 4, 6తో 16 బంతుల్లోనే అతడి అర్ధ శతకం పూర్తయింది. మిచెల్ ఒవెన్ (36*) కూడా దూకుడుగా ఆడాడు. 17వ ఓవర్ తొలి బంతికి డేవిడ్.. బంతిని బౌండరీకి తరలించి టీ20లలో ఆసీస్ తరఫున అత్యంత వేగవంతమైన శతకంతో పాటు మ్యాచ్‌నూ ముగించాడు. అంతకుముందు విండీస్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ (102) తన కెరీర్లో తొలి టీ20 సెంచరీ సాధించగా బ్రాండన్ కింగ్ (62) రాణించాడు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3-0తో ఆధిక్యంలో ఉంది.