లండన్: ఇంగ్లండ్ కౌంటీల్లో బరిలోకి దిగిన తొలిసారే భారత స్టార్ క్రికెటర్ ఠాకూర్ తిలక్‌వర్మ సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఎసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హంప్‌షైర్ తరఫున బరిలోకి తిలక్(239 బంతుల్లో 100) శతకంతో విజృంభించాడు. భారత టెస్టు జట్టులో చోటు ఆశిస్తున్న ఈ హైదరాబాదీ బ్యాటర్ కౌంటీల్లో సత్తాచాటాలన్న పట్టుదలతో బరిలోకి దిగాడు.
11-2తో హంప్‌షైర్ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్ అద్భుత పరిణతి కనబరిచాడు. కౌంటీల్లో ఆడుతున్నది మొదటిసారే అయినా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఎసెక్స్ బౌలర్లను ఎదుర్కొంటూ జట్టును ఒడ్డున పడేశాడు. ఈ క్రమంలో ఫ్లెచా మిడిల్టన్(52), కెప్టెన్ బెన్ బ్రౌన్(43), లియామ్ డాసన్ కలిసి 129 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆఫ్‌స్పిన్నర్ సైమన్ హర్మర్ను ఏ మాత్రం కుదురుకోనివ్వని తిలక్ సాధికారిక ఇన్నింగ్స్‌తో కదంతొక్కాడు. టీ20 బ్యాటర్ అని తనపై ఉన్న ముద్రను చెరిపేసుకునేందుకు కౌంటీల బాటపట్టిన తిలక్ తొలి ప్రయత్నంలోనే సఫలమయ్యాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి పీయూశ్ చావ్లా, మురళీ విజయ్, రహానే సరసన తిలక్ నిలిచాడు. రానున్న దేశవాళీ సీజన్లోనూ మెరుపులు మెరిపించేందుకు వర్మ సిద్ధమవుతున్నాడు.