హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీమిండియా స్టార్ ప్లేయర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ మెగా లీగ్ తొలి ఎడిషన్ వేలంలో ఈ ఇద్దరు ఐకాన్ కేటగిరీలో బరిలో నిలిచారు. ఈ నెల 7న హైదరాబాద్లో జరిగే ఆటగాళ్ల వేలానికి మొత్తం 1300 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేసుకున్నారు. రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సీవీ మిలింద్, తన్మయ్ అగర్వాల్ హైదరాబాద్ సీనియర్ ప్లేయర్లు ఎనిమిది ఫ్రాంచైజీల హాట్ కేక్స్గా మారే అవకాశం ఉంది. వేలం కోసం ప్రతీ ఫ్రాంచైజీకి రూ. 60 లక్షల బడ్జెట్ కేటాయించారు. ఇందులో కనీసం రూ. 54 లక్షలు చేసి గరిష్టంగా ఒక్కో జట్టు 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయొచ్చు. వేలం ప్రక్రియ మొదట ఐకాన్ కేటగిరీతో ప్రారంభం అవుతుంది. తర్వాత ఏ ప్లస్, ఏ, బి, సి1, సి2 కేటగిరీల వారీగా కొనసాగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో.. ప్రతి ఫ్రాంచైజీ కనీసం నలుగురు జిల్లా ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలి. కాగా, ఈ నెల 21న టీజీ 20 లీగ్ ప్రారంభం అవుతుంది. మొత్తం 32 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియంలోనే జరగనున్నాయి.