ప్రస్తుతం ఐపీఎల్లో భారత్‌కు దొరికిన మరో అద్భుతమైన పేసర్ ఆకాష్ దీప్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడుతున్న ఆకాష్.. పరుగులు కొంచెం ఎక్కువగానే ఇచ్చినప్పటికీ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టుకు ఉపయోగపడుతున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల చూపు తనవైపు తిప్పుకున్నాడు. ఒక ఎండ్‌లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తుంటే.. మరో ఎండ్‌లో అతనికి చక్కటి సహకారం అందిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆర్సీబీ తమ యూట్యూబ్ ఛానెల్లో తాజాగా ఆకాష్ దీప్ ఇంటర్వ్యూను విడుదల చేసింది. దానిలో కొన్ని ఆసక్తికర వివరాలు పంచుకున్నాడీ పేసర్. బిహార్‌లోని సాసరం గ్రామానికి చెందిన తను క్రికెట్ ఆడటం అంత సులభంగా జరిగేది కాదన్నాడు. క్రికెట్ ఆడుతున్నానని తండ్రికి తెలిస్తే కోప్పడతాడని, ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా క్రికెట్ ఆడేవాడినని చెప్పాడు.
‘‘మా రాష్ట్రం నుంచి ఒక్క క్రికెటర్ కూడా ప్రొఫెషనల్‌గా ఎదగలేదు. దాంతో తల్లిదండ్రుల భయాలు వారికుంటాయి. నేను ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఎదుగుదామని నిర్ణయించుకోవడం మా నాన్నకు నచ్చలేదు. అసలు మా ఏరియాలో క్రికెట్ ఆడుతున్నామంటే ఏదో క్రైమ్ చేసినట్లు చూసేవాళ్లు’’ అని చెప్పాడు. అలాగే తను ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీకి ఫ్యాన్‌గా ఉన్నానన్నాడు. కోహ్లీ, డివిల్లీర్స్ వంటి వారి కోసం ఆర్సీబీ మ్యాచ్‌లన్నీ తప్పకుండా చూసేవాడినని గుర్తుచేసుకున్నాడు.
‘‘మిగతా ఐపీఎల్ అంతా మిస్ అయినా సరే.. ఆర్సీబీ మ్యాచ్‌లు మిస్ అయ్యేవాడిని కాదు. అలాంటిది ఆర్సీబీకి, అందునా కోహ్లీ భాయ్‌తో కలిసి ఆడుతుండటం చాలా సంతోషంగా ఉంది. నేను కన్న కలలు నిజమైనట్లే అనిపిస్తోంది’’ అని తెలిపాడు. ప్రస్తుతం నెమ్మదిగా ఆర్సీబీ బౌలింగ్‌లో కీలక సభ్యుడిగా మారుతున్న ఆకాష్.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. చెన్నైతో జరిగే మ్యాచ్‌లో హర్షల్ పటేల్ ఆడటం లేదు. దీంతో ఆకాష్ బౌలింగ్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది.