బెనోని(దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా అండర్-19తో మూడు వన్డేల సిరీస్‌ను యువ భారత్ మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో భారత అండర్-19 జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వాతావరణం సరిగా లేకపోవడంతో 27 ఓవర్లలో నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని యువ భారత్ 23.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ(24 బంతుల్లో 68, ఫోర్, 10 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీతో దుమ్మురేపాడు.
ఛేదనలో 95 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో సూర్యవంశీ తనదైన సఫారీలపై పిడుగులా విరుచుకుపడ్డాడు. దొరికిన బౌలర్‌ను దొరికినట్లు బాదుతూ తన ఇన్నింగ్స్‌లో 10 భారీ సిక్స్‌లు నమోదుచేశాడు. సూర్యవంశీకి తోడు అభిజ్ఞాన్ కుందు(48 నాటౌట్) రాణించడంతో యువ భారత్ విజయం సులువైంది. అంతకముందు 49.3 ఓవర్లలో దక్షిణాఫ్రికా అండర్-19 టీమ్ 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. రావెల్స్(114) సెంచరీతో ఆకట్టుకున్నాడు. కిషన్‌సింగ్(4/46) నాలుగు వికెట్లతో రాణించాడు.