ఢిల్లీ: ఆసియా చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతక వేట కొనసాగుతున్నది. మహిళల 25 మీటర్ల పిస్టోల్ ఈవెంట్లో యువ షూటర్లు మను బాకర్, ఇషా సింగ్ సత్తాచాటారు. సోమవారం ఇక్కడ అత్యంత ఉత్కంఠ నడుమ సాగిన ఈవెంట్లో విజేతను తేల్చేందుకు షూటాఫ్ అవసరమవగా.. మను, ఇషా తృటిలో స్వర్ణ పతకానికి దూరమయ్యారు. ఫైనల్లో మను, గుయెన్ థుయ్ (వియత్నాం), ఇషా స్కోర్లు సమమవ్వడంతో షూటాఫ్ అవసరమొచ్చింది.
ఇషా.. షూటాఫ్ ఆరంభంలో ఆధిక్యంలోనే ఉన్నా 8, 9వ సిరీస్‌కు వచ్చేసరికి గురి తప్పి 30 పాయింట్లకే పరిమితమై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ టోర్నీలో ఆమెకు ఇది మూడో పతకం. మరోవైపు మను, గుయెన్ స్కోర్లు 35తో సమమవగా షూటాఫ్‌లో వియత్నాం అమ్మాయి.. 3-2తో గెలిచి స్వర్ణాన్ని దక్కించుకోగా భారత షూటర్ రజతం గెలుచుకుంది. జూనియర్ విభాగంలో తెలంగాణ యువ షూటర్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టోల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచాడు.