కాన్బెర్రా: ఇది కదా మ్యాచ్ అంటే! టెస్టులకు ఉన్న గొప్పదనమేంటో మరోమారు నిరూపితమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మహిళల యాషెస్ టెస్టు మ్యాచ్ క్రికెట్ అభిమానులకు కలకాలం గుర్తుండిపోనుంది. విజయం కోసం కడదాకా నువ్వానేనా అన్నట్లు పోరాడినా అమ్మాయిలు అదరహో అనిపించారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ ఉత్కంఠ ‘డ్రా’గా ముగిసింది. ఆసీస్ విసిరిన 257 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లండ్.. 9 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. కెప్టెన్ హీథర్నైట్ (48), స్కీవర్ (58), సోఫియా (45) రాణించడంతో ఓ దశలో మెరుగైన స్థితి (218/3)లో కనిపించిన ఇంగ్లండ్ ఒక్కసారిగా కుప్పకూలింది. సదర్లాండ్ (3/69), అల్నా కింగ్ (39) విజృంభణతో ఇంగ్లండ్ వరుస విరామాల్లో వికెట్లు (244/9) కోల్పోయింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్కు క్యూ కట్టడం ఇంగ్లండ్ గెలుపు అవకాశాలను దెబ్బతీసింది. చకాచకా వికెట్లు తీసిన ఆసీస్..ఆఖరి వికెట్ను ఖాతాలో వేసుకోలేకపోయింది. తొలుత ఓవర్నైట్ స్కోరు 12/2 నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. 216/7 వద్ద డిక్లేర్ చేసింది. అజేయ సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ కెప్టెన్ నైట్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.