హైదరాబాద్, ఆట ప్రతినిధి : తెలంగాణ సెయిలింగ్ చాంపియన్‌షిప్ పోటీలు హుసేన్సాగర్ వేదికగా హోరాహోరీగా సాగుతున్నాయి. రెండో రోజైన శుక్రవారం జరిగిన పోటీల్లో టాప్‌సీడ్ సెయిలర్లు గోవర్ధన్, శ్రవణ్ సత్తాచాటారు. సబ్‌జూనియర్ అప్టిమిస్టిక్ క్లాస్ ఆఫ్ బోట్లలో, జూనియర్ సెయిలర్లు అప్టిమిస్టిక్ క్లాస్ఆఫ్ బోట్లలో పోటీపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన గోవర్ధన్..సబ్‌జూనియర్ ఓవరాల్ అప్టిమిస్టిక్ కేటగిరీలో స్థిరమైన ప్రదర్శనతో ఆధిక్యం కనబరిచాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చి పసిడి పతకానికి చేరువయ్యాడు. ఇదే రేసులో దీక్షిత రెండు రేసుల్లో నిరాశపరిచి రెండో స్థానంలో కొనసాగుతున్నది. దీక్షిత సోదరి లాహిరి..సబ్‌జూనియర్ ఓవరాల్ అప్టిమిస్టిక్లో మూడో స్థానానికి పడిపోయింది. మరోవైపు జూనియర్ లేజర్ ఫ్లీట్‌లో నల్గొండకు చెందిన శ్రవణ్ కత్రావత్ ఒక రేసు మినహా అన్నింటిలో గెలిచి టాప్‌లో నిలిచాడు. బాలికల జూనియర్ లేజర్ ప్లీట్లో మాన్య అగ్రస్థానం దక్కించుకుంది.