IND vs Ireland | గత మ్యాచ్‌లో బౌలింగ్ బలంతో విజయం సాధించిన భారత్.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకునేందుకు సమాయత్తమైంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్‌లో మనవాళ్లకు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోగా.. బౌలర్లు మాత్రం అంచనాలకు మించి రాణించారు. ముఖ్యంగా సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. బౌలింగ్‌తో పాటు సారథ్యంలోనూ భేష్ అనిపించుకున్నాడు. మరి రెండో టీ20లోనూ మనవాళ్లు అదే జోరు కొనసాగిస్తారా చూడాలి! సోమవారం ఆసియా కప్ కోసం జట్టు ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
డబ్లిన్: వన్డే ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో యువ ఆటగాళ్లకు మరో చక్కటి అవకాశం! ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. ఆదివారం రెండో మ్యాచ్‌కు సిద్ధమైంది. శుక్రవారం జరిగిన తొలి పోరులో సునాయాసంగా నెగ్గిన యంగ్ఇండియాకు.. ఈ మ్యాచ్‌లోనూ ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురయ్యే అవకాశాలు కనపించడం లేదు. అయితే.. త్వరలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలు జరుగనుండటంతో.. టీమ్ఇండియాలో చోటు దక్కించుకోవాలని భావిస్తున్న యంగ్ ప్లేయర్లకు ఇది చక్కటి అవకాశం కానుంది.
ఆసియాకప్ కోసం సోమవారం జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణపై అదనపు ఒత్తిడి ఉండనుంది. గత మ్యాచ్‌కు వర్షం అడ్డు పడగా.. ఆదివారం పోరుకు వాతావరణం సహకరించనుంది. తొలి మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లతోనే ఇరు జట్లు బరిలో దిగే అవకాశాలున్నాయి. తొలి టీ20లో ఐర్లాండ్ టాపార్డర్‌ను సులువుగా కట్టడి చేసిన భారత బౌలర్లు లోయర్ ఆర్డర్ వికెట్లు పడగొట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ లోటుపాట్లను సరిచేసుకునేందుకు ఈ మ్యాచ్ చక్కటి అవకాశం కానుంది.
తిలక్‌కు అగ్ని పరీక్ష
వెస్టిండీస్‌తో పర్యటనలో నిలకడగా రాణించిన తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మను వన్డే ప్రపంచకప్ జట్టులోకి తీసుకోవాలనే వాదనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి అతడిపైనే నిలువనుంది. గత మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన ఈ హైదరాబాదీ కీలక మ్యాచ్‌లో ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. ఇప్పటికే సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరగగా.. సోమవారం ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సారి భారీ (దాదాపు 17 మందితో) జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. తిలక్ నిలకడైన ప్రదర్శన కనబరిస్తే వన్డే పిలుపు రావడం దాదాపు ఖాయమే! మిడిలార్డర్లో ఎడమచేతి వాటం బ్యాటర్లు లేకపోవడంతో రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ వంటి పలువురు మాజీలు తిలక్‌ను మెగాటోర్నీకి ఎంపిక చేయాలని అంటున్న విషయం తెలిసిందే. సంజూ శాంసన్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. విండీస్ టూర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన శాంసన్.. ఆసియాకప్ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగానే ఉంది.