Paris Olympics | నమస్తే తెలంగాణ క్రీడా విభాగం: మరో వారం రోజుల్లో తెరలేవనున్న పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు కచ్చితంగా పతకం వచ్చే ఈవెంట్లలో అథ్లెటిక్స్ ఒకటి. టోక్యో ఒలింపిక్స్ (2020)లో ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో భాగంగా జావెలిన్ త్రో విభాగంలో పసిడి గెలుచుకున్న నీరజ్ చోప్రా.. మరోసారి మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాలని దేశం కోరుకుంటోంది.
గత మూడేండ్లుగా నిలకడగా రాణిస్తున్న నీరజ్ మరోసారి పసిడి త్రో విసిరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అతడితో పాటు మిగిలిన అథ్లెట్లూ విశ్వక్రీడల్లో చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి అథ్లెటిక్స్‌లో 29 మందితో బరిలో దిగుతున్న భారత్‌కు అథ్లెట్లు ఏ మేరకు పతకాలు పట్టుకొస్తారో..!
‘గోల్డెన్ బాయ్’పైనే ఆశలు
క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉన్న భారత్‌లో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత నీరజ్ చోప్రా వారికి ఏమాత్రం తీసిపోని స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. ఒర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం మనదేశంలో 10 మంది టాప్ ఫేవరేట్ అథ్లెట్లలో కోహ్లీ, రోహిత్, ధోనీ వంటి దిగ్గజాలతో పోటీపడిన నీరజ్ 7వ స్థానంలో నిలిచాడంటే అతడి క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ ఆకర్షణలే గాక ఫీల్డ్ లోకి దిగి జావెలిన్‌ను విసిరాడంటే అది ఆకాశంలో తారాజువ్వలా దూసుకుపోవాల్సిందే.
2018లో ఆలిండియా ఇంటర్ సర్వీసెస్ మీట్లో స్వర్ణం గెలిచిన తర్వాత అతడు పాల్గొన్న 23 ఈవెంట్లలో ఏ ఒక్కదాంట్లో కూడా పోడియం (టాప్-3) ఫినిష్ చేయకుండా వదల్లేదు. ఇక ‘టోక్యో’ తర్వాత 17 టోర్నీలలో పాల్గొని 11 ఈవెంట్స్‌లో ప్రథమ స్థానం దక్కించుకున్నాడంటే అతడి నిలకడను అర్థం చేసుకోవచ్చు. గత కొంతకాలంగా ‘90 మీటర్ల మార్కు’ కోసం తపిస్తున్న నీరజ్‌కు ఈ సీజన్లో బెస్ట్ త్రో 88.36 మీటర్లు.
అంతర్జాతీయ స్థాయిలో తనకు ప్రధాన పోటీదారులుగా ఉన్న జకుబ్ వద్లెచ్ (88.65 మీటర్లు), జులియన్ వెబర్ (88.37 మీటర్లు) నీరజ్ కంటే కాస్త మెరుగ్గా ఉన్నారు. మ్యాక్స్ డెహ్నింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 90.20 మీటర్లు విసిరి నీరజ్‌కు గట్టి సవాల్ విసురుతున్నాడు. అయితే కొంతకాలంగా యూఎస్ఏలో ప్రత్యేక శిక్షణ పొందిన నీరజ్.. ‘పారిస్’కు ముందు అక్కడ జరిగిన డైమండ్ లీగ్‌కు దూరంగా ఉండి విశ్వక్రీడల కోసం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతూ ‘డబుల్ గోల్డ్’పై కన్నేశాడు. ఇదే ఈవెంట్లో మరో జావెలిన్ త్రోయర్ కిషోర్ కుమార్ జెనా పోటీపడుతున్నా చాలాకాలంగా అతడు 80 మీటర్ల మార్కును దాటడం లేదు.
జ్యోతి మెరిసేనా..
అంతర్జాతీయ స్థాయిలో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ గత కొంతకాలంగా సత్తా చాటుతూ భారత్‌కు పతకం మీద ఆశలు కల్పిస్తోంది. 100 మీటర్ల హర్డిల్స్‌లో బరిలోకి దిగుతున్న జ్యోతి.. 12.78 సెకన్లతో సీజన్ బెస్ట్‌ను నమోదు చేసింది. వరల్డ్ ర్యాంకింగ్స్ ద్వారా పారిస్‌కు సెలక్ట్ అయిన జ్యోతి సెమీస్ వరకు చేరినా పతకం ఖాయం చేసుకున్నట్టే.
సాబ్లె సాధించేనా..
నీరజ్‌తో పాటు ఈసారి భారత్‌కు పతక ఆశలు రేపుతున్న మరో అథ్లెట్ అవినాశ్ సాబ్లె. పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ చేజ్లో నిలకడగా రాణిస్తున్న ఈ బీడ్ (మహారాష్ట్ర) యువకుడు.. ఇటీవలే ‘నేషనల్ బెస్ట్’ (8:09.91 నిమిషాలు)తో ఆసియాలోనే నాలుగో అత్యుత్తమ గణాంకాలు నమోదుచేశాడు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైన అతడు.. 2022లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్‌లో రజతంతో మెరిశాడు. గత రెండేండ్లలోనూ పలు ఈవెంట్లలో రాణిస్తూ పతకంపై ఆశలు రేపుతున్నాడు. ఇదే ఈవెంట్ మహిళల విభాగంలో పారుల్ చౌదరీపైనా ఈసారి అంచనాలున్నాయి. ఆమె 5000 మీటర్ల మహిళల స్టీపుల్ చేజ్ ఈవెంట్లోనూ పాల్గొంటోంది.
వీరికి తోడు షాట్‌పుట్‌లో తజిందర్ పాల్ సింగ్, పురుషుల 4X400 మీటర్ల రిలేలో మహ్మద్ అనాస్, మహ్మద్ అజ్మల్, అమోజ్ జాకబ్, రాజేశ్ రమేశ్, సంతోష్, చాకో కురియన్, ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్, అబ్దుల్లా అబూబకర్, హైంజప్లో సర్వేశ్ కుశారె, మహిళల జావెలిన్ త్రో లో అన్నూ రాణిపై భారత్ ఆశలు పెట్టుకుంది.