హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్(టీకేఏ) ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా మహిళల జాతీయ సీనియర్ కబడ్డీ టోర్నీ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆతిథ్య తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన 30 జట్లు పోటీపడుతున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ప్రేక్షకులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(సాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. మార్చ్‌పాస్ట్‌లో ప్లేయర్ల గౌరవవందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ప్లేయర్లు ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీకేఏ అధ్యక్షుడు కాసాని వీరేశ్, ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి, టీమ్ కోచ్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.