లండన్: మహిళల టెన్నిస్ కొత్త ధ్రువతార ఉదయించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్‌లో సరికొత్త విజేత వచ్చింది. చెక్ రిపబ్లిక్కు చెందిన 21 ఏండ్ల టెన్నిస్ స్టార్ లిండా నొస్కోవా గ్రాస్ కోర్ట్ చాంపియన్‌గా అవతరించింది. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో శనివారం రాత్రి హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ నొస్కోవా 6-2, 5-7, 6-3 తేడాతో తన దేశానికే చెందిన కరోలినా ముకోవాపై అద్భుత విజయం సాధించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్‌ను కైవసం చేసుకుంది. మార్కెటా వొండ్రూసోవా (2023), బార్బోరా క్రెజికోవా (2024) తర్వాత గత నాలుగేళ్లలో వింబుల్డన్ గెలిచిన మూడో చెక్ రిపబ్లిక్ ప్లేయర్‌గా నొస్కోవా నిలిచింది. అలాగే పెట్రా క్విటోవా తర్వాత ఈ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగానూ రికార్డు సృష్టించింది.
ఇద్దరు చెక్ అమ్మాయిల మధ్య తుదిపోరు మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఆట ప్రారంభం నుంచే నొస్కోవా శక్తిమంతమైన బేస్‌లైన్ షాట్లతో చెలరేగింది. పదో సీడ్ ముకోవా చేసిన తప్పిదాలను అనుకూలంగా మార్చుకుంటూ తొలి సెట్‌ను సులువుగా గెలిచింది. రెండో సెట్లో 5-2తో నిలిచి ఈజీగా మ్యాచ్ నెగ్గేలా కనిపించింది. ఈ దశలో నొస్కోవాకు ఐదు చాంపియన్‌షిప్ పాయింట్లు లభించినప్పటికీ.. ముకోవా అసాధారణ పోరాట పటిమను కనబరిచింది. ఒత్తిడిని అధిగమించి వరుసగా ఐదు గేమ్స్ గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు చేర్చింది. అయితే, చివరి సెట్లో నొస్కోవా మళ్లీ తన లయను అందుకుంది.
ముకోవా అలసటను అనుకూలంగా మార్చుకుంటూ ప్రారంభంలోనే ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ముకోవాకు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా తన సర్వీసులను కాపాడుకుంటూ సెట్‌తో పాటు ట్రోఫీ కైవసం చేసుకుంది. రెండున్నర గంటల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో పది ఏస్‌లు, 44 విన్నర్లు కొట్టిన నొస్కోవా నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించింది. 6 ఏస్‌లకే పరిమితం అయిన ముకోవా 35 విన్నర్లు, రెండు బ్రేక్ పాయింట్లకే పరిమితం అయింది.
సినర్ X జ్వెరెవ్
రా. 8.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో