మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్‌తో జరిగిన పోరులో మన అమ్మాయిలు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఎప్పటి నుంచో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తొలి అడ్డంకిని విజయవంతంగా దాటింది. తొలుత బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్థాన్‌ను ఓ మాదిరి స్కోరుకు పరిమితం చేయగా.. అనంతరం టాపార్డర్ దంచికొట్టడంతో భారత్ అలవోకగా విజయతీరాలకు చేరింది.
కేప్‌టౌన్: ప్రపంచ చాంపియన్‌గా నిలువాలనే సంకల్పంతో దక్షిణాప్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత మహిళల జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. మెగాటోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన తమ తొలి పోరులో హర్మన్‌ప్రీత్‌కౌర్ బృందం 7 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీమ్ఇండియా తొలి మ్యాచ్‌లో విశ్వరూపం చూపింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్ (55 బంతుల్లో 68 నాటౌట్; 7 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా.. అయేషా నసీమ్ (25 బంతుల్లో 43 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో దంచికొట్టింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 2, దీప్తి శర్మ, పూజ వస్ర్తాకర్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మన అమ్మాయిలు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. షఫాలీ వర్మ (33; 4 ఫోర్లు), రిచా ఘోష్ (20 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. యష్తిక భాటియా (17), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (16) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో నశ్ర రెండు వికెట్లు పడగొట్టింది. అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీమ్ఇండియా తమ తదుపరి పోరులో బుధవారం వెస్టిండీస్‌తో తలపడనుంది.
ఓ మోస్తారు లక్ష్యఛేదనలో భారత్‌కు శుభారంభం దక్కింది. ఇటీవలే సఫారీ గడ్డపై కెప్టెన్‌గా అండర్-19 ప్రపంచకప్ అందుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ దంచికొట్టడంతో 5 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 33 పరుగులు చేసింది. కొన్ని మంచి షాట్లు ఆడిన యష్తిక ఔట్ కాగా.. కాసేపటికి షఫాలీ కూడా ఆమెను అనుసరించింది. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఎక్కువసేపు నిలువలేకపోయింది. దీంతో భారత్ విజయసమీకరణం 36 బంతుల్లో 55కు చేరుకుంది. ఇక కష్టమే అనుకుంటున్న దశలో జెమీమా రోడ్రిగ్స్ రెచ్చిపోయింది. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆమెకు రిచా ఘోష్ చక్కటి సహకారం అందించడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. నిదా వేసిన 17వ ఓవర్లో జెమీమా, రిచ చెరో ఫోర్ కొట్టడంతో 13 పరుగులు రాగా.. 18వ ఓవర్లో రిచా హ్యాట్రిక్ ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించింది. భారత విజయానికి 12 బంతుల్లో 14 పరుగులు అవసరమైన దశలో జెమీమా రోడ్రిగ్స్ మూడు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించింది.
పాకిస్థాన్: 20 ఓవర్లలో 149/4 (బిస్మా 68 నాటౌట్; ఆయేషా 43 నాటౌట్; రాధ 2/21), భారత్: 19 ఓవర్లలో 151/3 (జెమీమా 53 నాటౌట్; షఫాలీ 33; నశ్ర 2/15).