బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల విజయ పరంపర కొనసాగుతున్నది. సోమవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లలో ఇద్దరు బాక్సర్లు తమ పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్‌కు దూసుకెళ్లారు. మహిళల 60 కిలోల విభాగంలో సంజూతో పాటు పురుషుల 90+ కేజీల కేటగిరీలో అన్షుల్ గిల్ సెమీఫైనల్ చేరారు. సంజూ.. 5-0తో ఇండోనేషియా బాక్సర్ రేఖ మరియానాను ఓడించింది.
మూడు రౌండ్ల పాటు గేమ్‌పై పూర్తి నియంత్రణ కొనసాగించిన ఆమె.. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా విజయం సాధించింది. ఇక పురుషుల క్వార్టర్స్‌లో అన్షుల్ సైతం 5-0తో కజకిస్థాన్‌కు చెందిన డేనియల్ సపర్బెను మట్టికరిపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అన్షుల్.. ప్రత్యర్థి విసిరే పంచ్లనూ సమర్థంగా అడ్డుకున్నాడు. సెమీస్‌లో అతడు ఉజ్బెకిస్థాన్‌కు చెందిన రుస్తమోవ్‌తో తలపడనున్నాడు. తాజా విజయాలతో ఈ ఇద్దరూ పతకం ఖాయం చేసుకోవడం విశేషం.