హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ కెరటం అగసర నందిని.. జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. గుజరాత్‌లోని నడియాడ్‌లో జరిగిన 20వ ఫెడరేషనల్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నందిని డబుల్ ధమాకా మోగించింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం చేజిక్కించుకున్న నందిని.. లాంగ్ జంప్‌లో రజతం కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ రేసును 13.97 సెకండ్లలో పూర్తిచేసిన తెలంగాణ గురుకులాల విద్యార్థిని నందిని.. లాంగ్‌జంప్‌లో 5.92 మీటర్లు లంఘించింది. ఆగస్టులో కొలంబియా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక జూనియర్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నందిని దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. మరోవైపు ఇదే టోర్నీ బాలికల 100 మీటర్ల పరుగు పందెంలో తెలంగాణకు చెందిన జివాంజి దీప్తి రజతం కైవసం చేసుకుంది.