Bhukya Yashwant | మరిపెడ, సెప్టెంబర్ 25: తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని చేతల్లో చూపెడుతూ మరోమారు పర్వతంపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతిష్ఠాత్మక మౌంట్ గోరిచెన్ శిఖరాన్ని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యాతండాకు చెందిన యశ్వంత్ అధిరోహించాడు.
ఇప్పటికే యువ పర్వతారోహకుడిగా గుర్తింపు సాధించిన యశ్వంత్.. గోరిచెన్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సాధించాడు. ఈ పర్వతారోహణను ఈనెల 4న ప్రారంభించి 19 తేదీ వరకు పూర్తి చేసాడు. గతంలో ఈ కుర్రాడు.. దక్షిణాఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో, యూరప్‌కు చెందిన మౌంట్ ఎల్బ్రస్ తదితర పర్వతాలు ఎక్కాడు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా యశ్వంత్ ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే బుధవారం అసోం రాజ్‌భవన్‌లో గవర్నర్ లక్ష్మణప్రసాద్ ఆచార్యను యశ్వంత్ మర్యాదపూర్వకంగా కలిసి పూలబోకే అందించాడు. భవిష్యత్‌లోనూ ఇలానే మరిన్ని పర్వతాలు అధిరోహించాలని గవర్నర్ ఆకాంక్షించినట్లు తెలిపాడు.