కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ ర్యాపిడ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన పోరులో ప్రపంచ నాలుగో ర్యాంకర్ లెవాన్ ఆరోనియన్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ద్వారా అర్జున్ విజేతగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్లలో 6.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న అర్జున్ అగ్రస్థానంలో నిలిచాడు. ఆరోనియన్ (5.5), ప్రజ్ఞానంద (5.5), విదిత్ గుజరాతీ (5.5) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఆఖరి గేమ్ విషయానికొస్తే తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ఆరోనియన్కు అర్జున్ దీటైన పోటీనిచ్చాడు. అయితే తన అనుభవాన్ని ఉపయోగిస్తూ పై చేయి సాధించేందుకు ఆరోనియన్ ప్రయత్నం చేశాడు. గేమ్ సాగుతున్నా కొద్ది ఈ అర్మేనియా నంబర్‌వన్ ప్లేయర్ మరింత పట్టు బిగించేలా ముందుకు సాగాడు. ఒక దశలో గేమ్ చేజారుతున్న క్రమంలో అద్భుతంగా పుంజుకున్న అర్జున్.. ఆరోనియన్ను కట్టడి చేసి డ్రా చేసుకున్నాడు.