హైదరాబాద్, ఆట ప్రతినిధి:స్పెయిన్ వేదికగా ఈ నెల 21 నుంచి 29 వరకు జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ సెయిలింగ్ చాంపియన్షిప్నకు తెలంగాణ యువ ప్లేయర్లు అలేఖ్య కుందు, పిల్లి అఖిల్ ఎంపికయ్యారు. వీరిద్దరు భారత జట్టు తరఫున 420 క్లాస్ విభాగంలో ప్రాతినిధ్యం వహించనున్నారు. గత మూడు అంతర్జాతీయ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడం ద్వారా అలేఖ్య, అఖిల్..ప్రపంచ టోర్నీకి అర్హత సాధించారు.
వివిధ దేశాలకు చెందిన 126 మంది సెయిలర్లు పోటీపడుతున్న మెగాటోర్నీలో భారత్ నుంచి వీరిద్దరు మాత్రమే పోటీపడనున్నారు. దీనికి తోడు గత నాలుగేండ్ల కాలంలో ప్రపంచ సెయిలింగ్ టోర్నీకి ఎంపికైన తొలి భారత జోడీ వీరే కావడం విశేషం. ప్రస్తుతం అర్జున్ ప్రదీపక్, సంజీవ్ చౌహాన్ దగ్గర అలేఖ్య, అఖిల్ శిక్షణ తీసుకుంటున్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న అలేఖ్య మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చూస్తున్నది.