న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ భారత జట్టుకు నేతృత్వం వహించనుంది. వచ్చే నెల 15 నుంచి 26 వరకు న్యూఢిల్లీ వేదికగా జరుగనున్న ఈ మెగాటోర్నీలో ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు)తో పాటు టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (75 కేజీలు) బరిలోకి దిగనుంది.
ఈ మెగాటోర్నీ కోసం భారత బాక్సింగ్ సమాఖ్య సోమవారం 12 మంది మహిళా బాక్సర్లను ఎంపిక చేసింది. 2022లో ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గిన నిఖత్.. ఈసారి కూడా చాంపియన్‌గా నిలువాలని కృతనిశ్చయంతో ఉంది. ‘గత కొన్నేండ్లుగా మన బాక్సర్లు అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్నారు. ఐబీఏ మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ భారత బాక్సర్లు ఇదే కొనసాగిస్తారని ఆశిస్తున్నాం’ అని బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్‌సింగ్ పేర్కొన్నాడు.