హైదరాబాద్, ఆట ప్రతినిధి: న్యూఢిల్లీలోని కర్ణిసింగ్ రేంజ్ వేదికగా జరిగిన 6వ జాతీయ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ షూటర్ బానోతు పావని మూడు రజత పతకాలతో సత్తాచాటింది. బుధవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్(జూనియర్) రజత పతకంతో మెరిసిన పావని అదే దూకుడు కొనసాగిస్తూ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్(జూనియర్ మిక్స్డ్)తో పాటు మిక్స్డ్ ఈవెంట్లోనూ వెండి పతకాలను కైవసం చేసుకుంది.
జూనియర్ షూటర్ అయినప్పటికీ సీనియర్లతో పోటీపడుతూ అద్భుత ప్రదర్శన కనబరిచింది. వైకల్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ పతకాలు కొల్లగొట్టింది. మరోవైపు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఖుష్బూ రెండు స్వర్ణాలు సహా ఒక రజతం ఖాతాలో వేసుకుంది. ఈ ఇద్దరు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, 2028 పారాలింపిక్స్ లాంటి మెగాటోర్నీలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు.