Sports University | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్‌లో దీన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నది. దాదాపు 12 వివిధ క్రీడల అకాడమీలను ఇక్కడే పెట్టాలని భావిస్తున్నది. వీటిలో అంతర్జాతీయ స్థాయి అధునాతన మౌలిక సదుపాయాలు ఉంటాయి. ఈ స్పోర్ట్స్‌హబ్‌లో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు.
కొత్తగా స్థాపించిన సిల్ యూనివర్సిటీ తరహాలోనే తెలంగాణ స్పోర్ట్స్ వర్సిటీకి ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ అనే పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనువైన స్థలంగా ప్రస్తుతం హకీంపేటలో ఉన్న స్పోర్ట్స్ సూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను పరిశీలిస్తున్నారు. ఆ క్యాంపస్‌ను ఒలింపిక్స్ స్థాయి అంతర్జాతీయ ప్రమాణాలు ఉండేలా అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల దక్షిణ కొరియాలో పర్యటనలో సియోల్‌లోని కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ వర్సిటీగా ప్రత్యేకత చాటుకున్నది. భవిష్యత్తులో ఒలింపిక్ చాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా తెలంగాణ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.