హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని జింఖానా గ్రౌండ్స్ వేదికగా జరిగిన అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ నేషనల్ చాంపియన్‌షిప్ 2025లో తెలంగాణ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తెలంగాణ అమెరికన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీ పురుషుల ఫైనల్లో కర్నాటక.. 19-12తో తెలంగాణను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది.
మహిళల విభాగంలో.. ఉత్తరప్రదేశ్.. 20-0తో కర్నాటకపై భారీ విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. సెమీఫైనల్స్‌లో తెలంగాణ.. 20-19తో కేరళను ఓడించి ఫైనల్ చేరినా టైటిల్ పోరులో తడబడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.భారత్‌లో అమెరికన్ ఫ్లాగ్ ఫుట్‌బాల్ పెరుగుతున్న ఆదరణకు ఈ టోర్నీ సాక్ష్యంగా నిలిచిందని, అనేక రాష్ర్టాల జట్లు ఉత్సాహంగా పాల్గొని టోర్నీని విజయవంతం చేశాయని ఆర్గనైజేషనల్ కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి తెలిపారు.