న్యూఢిల్లీ: తెలంగాణ యువ షట్లర్ మన్నేపల్లి తరుణ్ ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగబోతున్నాడు. సెప్టెంబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరగబోయే ఈ మెగా గేమ్స్ కోసం ఎంపిక చేసిన భారత బ్యాడ్మింటన్ జట్టులో థాయ్‌లాండ్ మాస్టర్స్ సూపర్-300 రన్నరప్ తరుణ్‌కు చోటు దక్కింది. 10 మంది సభ్యుల పటిష్టమైన పురుషుల జట్టుకు తరుణ్ ఎంపికయ్యాడు. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్‌లో లక్ష్యసేన్, హెచ్.ఎస్.ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ వంటి సీనియర్లతో కలిసి తరుణ్ భారత జట్టు తరఫున కోర్టులోకి దిగనున్నాడు. ఈ జట్టులో స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టితో పాటు ఆయుష్ శెట్టి, హరిహరన్, అర్జున్, ధ్రువ్ కపిల కూడా ఉన్నారు. కాగా, మహిళల జట్టుకు డబుల్ ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు నేతృత్వం వహిస్తుండగా.. యువ షట్లర్లు ఉన్నతి హుడా, తన్వి శర్మతో పాటు ట్రీసా జాలీ- పుల్లెల గాయత్రి జోడీ ఎంపికైంది.