హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్(టీఆర్ఏ) ఆధ్వర్యంలో గచ్చిబౌలి సాట్స్ రేంజ్ వేదికగా 11వ రాష్ర్ట షూటింగ్ చాంపియన్‌షిప్ శనివారం మొదలైంది. ఈనెల 30 వరకు జరిగే టోర్నీలో దాదాపు 500మందికి పైగా యువ షూటర్ల వివిధ విభాగాల్లో పోటీపడుతున్నారు. ప్రతిభ కల్గిన యువ ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మొదలైన టోర్నీలో వివిధ విభాగాల్లో సత్తాచాటేందుకు షూటర్లు సిద్ధంగా ఉన్నారు.
టోర్నీ తొలి రోజు ప్రాక్టీస్, క్వాలిఫయింగ్ రౌండ్లు జరుగగా, ఆదివారం నుంచి ప్రధాన పోటీలు జరుగనున్నాయి. టోర్నీలో 10మీ ఎయిర్‌రైఫిల్-పిస్టల్, 25మీటర్ల పిస్టల్, 50మీటర్ల రైఫిల్, ట్రాప్ ఈవెంట్లలో షూటర్లు బరిలోకి దిగనున్నారని టీఆర్ఏ అధ్యక్షుడు అమిత్సంఘి పేర్కొన్నా రు. పోటీలను అధికారికంగా ప్రారంభించిన ఆయన..తెలంగాణలో ప్రతిభ కల్గిన షూటర్లు కొదువలేదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోకుండా టోర్నీని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.