HCA | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభ కల్గిన యువ కల్గిన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)ను త్వరలో నిర్వహిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్రావు పేర్కొన్నారు. శనివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. చాంపియన్స్ ట్రోఫీకి టీమ్ఇండియా మేనేజర్‌గా ఎంపికైన కార్యదర్శి దేవరాజ్‌ను తొలుత సభ్యులందరూ అభినందించారు.
‘ఐపీఎల్ తర్వాత యువ క్రికెటర్ల కోసం టీపీఎల్ ఏర్పాట్లకు పనులు ప్రారంభిస్తాం. ఉమ్మడి జిల్లాల ప్రాతిపాదికన ప్రతీ జిల్లాకు క్రికెట్ అభివృద్ధికి కోటి ఖర్చు చేస్తాం. కొత్త స్టేడియాల నిర్మాణం కోసం పదెకరాలు సేకరిస్తాం. దేశవాళీ, అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన క్రికెటర్లను సత్కరించేందుకు మార్చిలో హెచ్‌సీఏ అవార్డుల కార్యక్రమం చేస్తాం. బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉప్పల్ స్టేడియం ఆధునీకరిస్తాం. ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు త్వరలో టెండర్లు పిలుస్తాం’ అని అన్నారు.