ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో సత్తాచాటేందుకు తెలంగాణ ప్లేయర్లు సిద్ధమయ్యారు. చైనా వేదికగా మొదలైన కాంటినెంటల్ టోర్నీలో పతకాలతో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేందుకు సమాయత్తమయ్యారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని పుణికిపుచ్చుకుంటూ ఇప్పటికే పలు మెగాటోర్నీల్లో పతకాలు కొల్లగొట్టి తెలంగాణ పేరును దశదిశలా వ్యాపింపజేసిన మన ప్లేయర్లు ఆసియాలోనూ అదరగొట్టేందుకు తహతహలాడుతున్నారు. ఆసియాడ్‌లో పతకాలు సాధించడం ద్వారా రానున్న పారిస్(2024) ఒలింపిక్స్‌కు మరింత ఆత్మవిశ్వాసంతో సిద్ధం కావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 19వ ఆసియాగేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్ల పతక అవకాశాలు, ప్రాతినిధ్యంపై సాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్తో నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రతిష్ఠాత్మక ఆసియాడ్‌లో మన తెలంగాణ ప్లేయర్లు కచ్చితంగా పతకాలు కొల్లగొడుతారన్న నమ్మకం నాకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న క్రీడాకారులు చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లోనూ రాణిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయడంలో ముందుండే మన వాళ్లు పతకాలతో సొంతగడ్డపై అడుగుపెడుతారన్న విశ్వాసం ఉంది. వేర్వేరు ఆసియా దేశాల నుంచి దీటైన పోటీ ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఆసియాడ్‌లో రాణించడం ద్వారా పారిస్ వేదికగా జరిగే విశ్వక్రీడలకు పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.
ఏషియన్ గేమ్స్‌లో మన ప్రాతినిధ్యం
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌కు తెలంగాణ నుంచి మొత్తం 17 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో 15 మంది ప్లేయర్లు కాగా, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. ఇందులో నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఇషాసింగ్, కైనాన్ చినాయ్ (షూటింగ్), శ్రీజ (టీటీ), గీతాంజలి (రోయింగ్), వ్రితి అగర్వాల్ (స్విమ్మింగ్), నందిని (అథ్లెటిక్స్), సంజన (స్కేటింగ్), సిక్కిరెడ్డి, సాయిప్రతీక్, గాయత్రీగోపీచంద్ (బ్యాడ్మింటన్), ప్రీతి (సెయిలింగ్), సౌమ్య (ఫుట్‌బాల్), అర్జున్ (చెస్), తిలక్‌వర్మ (క్రికెట్) ఉన్నారు. వీరికి తోడు భారత రోయింగ్ జట్టుకు హైదరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్ బేగ్ కోచ్‌గా ఉండగా, కనోయింగ్ ఈవెంట్‌కు రామకృష్ణ టెక్నికల్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ప్లేయర్ల ప్రాతినిధ్యం తెలంగాణకు గర్వకారణం.
పోటీలకు సన్నద్ధతపై
ఆసియాగేమ్స్ లాంటి మెగాటోర్నీలకు సిద్ధం కావాలంటే మెరుగైన సన్నద్ధత కావాలి. ఇందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్లేయర్లకు అండగా నిలిచింది. వసతి సౌకర్యాల విషయంతో పాటు మెరుగైన శిక్షణ కోసం ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటు అందించింది. స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అత్యుత్తమ శిక్షణ కోసం ప్రభుత్వం రెండు కోట్లు అందజేసింది. ఇలా కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ప్లేయర్లకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించిన వారికి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భారీగా నగదు ప్రోత్సాహకాలతో పాటు విలువైన భూములు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఈ విజయంలో సీఎం కేసీఆర్ విజన్‌తో మేము ముందుకు సాగుతున్నాం. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తాం.
సాట్స్ భవిష్యత్ ప్రణాళికలు
సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాట్స్ పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నది. గడిచిన ఆరు నెలల వ్యవధిలో పలు క్రీడాటోర్నీల ద్వారా సాట్స్ విజన్‌ను ఆవిష్కరించాం. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ టోర్నీని భారీగా నిర్వహించడంతో పాటు ట్రై క్రీడా ఉత్సవాలు, యువ క్రీడా సమ్మెళనాలు, చలో మైదాన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించాం. ప్రభుత్వం నిర్వహించిన టోర్నీల్లో పోటీపడటం ద్వారా ప్లేయర్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లు తీర్చిదిద్దుతున్నాం. ప్రపంచ అగ్రశ్రేణి అథ్లెట్లకు ప్రభుత్వం కావాల్సిన సహకారం అందించడంతో పాటు ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 17 వేలకు పైగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశాం. దీని ద్వారా రానున్న రోజుల్లో ప్రతిభ కల్గిన గ్రామీణ ప్రాంత ప్లేయర్లు మరింత మంది వెలుగులోకి వచ్చే అవకాశముంది. త్వరలో కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లను అందించేందుకు సిద్ధమవుతున్నాం. అక్టోబర్‌లో గోవాలో జరిగే నేషనల్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు భారీ సంఖ్యలో పతకాలు సాధిస్తారన్న గట్టి నమ్మకం నాకుంది.