హైదరాబాద్, ఆట ప్రతినిధి: జగత్పూర్(గుజరాత్) వేదికగా జరుగుతున్న యూటీటీ పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ పారా ప్యాడ్లర్ హితేశ్ దోల్వాని టైటిల్‌తో మెరిశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఎమ్10 ఫైనల్లో హితేశ్ 11-9, 11-5, 11-4తో జగనాథ్ ముఖర్జీ(హర్యానా)పై అద్భుత విజయం సాధించాడు.
ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన హితేశ్ వరుస గేముల్లో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. గేమ్ గేమ్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన హితేశ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య(టీటీఎఫ్ఐ) సహకారంతో యూటీటీ నిర్వహించిన తొలి పారా టీటీ ర్యాంకింగ్ టోర్నీలో విజేతగా నిలిచిన హితేశ్‌ను పలువురు అభినందించారు.