హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్(టీవోఏ) ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. గురువారం ఎల్బీ స్డేడియం ఎల్వీఆర్ భవన్ వేదికగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవుల కోసం పోలింగ్ జరిగింది. అధ్యక్ష పదవికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ పోటీపడ్డారు. మొత్తం 65 మందికి గాను 59 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికలకు సాట్స్ నుంచి డీడీ చంద్రారెడ్డి పరిశీలకునిగా హాజరయ్యారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా, ఎన్నికల ఫలితాలపై సిటీ సివిల్ కోర్టు స్టే ఇవ్వడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ఇదిలా ఉంటే కొన్ని అసోసియేషన్లను ఎన్నికల జాబితా నుంచి తప్పించడంపై రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ సిటీ సివిల్ కోర్టుతో పాటు హైకోర్టును ఆశ్రయించే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో తీర్పుపై ఆసక్తి నెలకొన్నది.